
మున్సిపల్ హైస్కూల్ తనిఖీ
భీమవరం: భీమవరం పట్టణంలోని చినరంగనిపాలెం మున్సిపల్ హైస్కూల్‌ను బుధవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు మెనూ వివరాలను ఆరాతీసి వండిన పదార్థాలను రుచి చూశారు. పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పిల్లలకు పెట్టే ఆహారంలో ఎలాంటి తేడా వచ్చినా ఉపేక్షించేది లేదని రోజువారీ మెనూ ప్రకారం అన్నీ తయారు చేసి పెట్టాలని ఆదేశించారు.
ధాన్యం సొమ్ములు తక్షణం చెల్లించాలి
భీమవరం: కేంద్ర ప్రభుత్వం రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9న జరిగే సమ్మె జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. మంగళవారం పట్టణంలో తాళ్లూరి హరిహర లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఆకుల హరేరామ్ మాట్లాడుతూ అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చేలా చూస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం రైతులను విస్మరించిందన్నారు. ఆక్వా, కోకో, మామిడి రైతులు పూర్తిగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. దాళ్వాలో రైతులు విక్రయించిన ఇంతవరకు సుమారు రూ.300 కోట్లు చెల్లించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తుల శ్రీరామచంద్రుడు, కిలారి తవిటి నాయుడు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నేడు ప్రైవేటు స్కూళ్ల మూసివేత
భీమవరం: ప్రైవేటు పాఠశాలలపై ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష చర్యలకు నిరసగా ఈ నెల 3న రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ స్కూళ్లను మూసివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏపీయూఎస్‌ఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు అక్కినేని కృష్ణకిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. కొంతమంది అధికారులు ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలపై అతిగా స్పందించడం, త్రీమెన్ కమిటీలు, తనిఖీలు వంటి ఏకపక్ష నిర్ణయాలు దారుణమన్నారు.
ఇంటర్మీడియెట్ అధికారిగా ప్రభాకరరావు
భీమవరం: జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిగా జి.ప్రభాకరరావు బాధ్యతలు బుధవారం స్వీకరించారు. ఆయన కార్యాలయ అధికారులు, సిబ్బంది, అధ్యాపకులు పుష్పగుచ్ఛం అందజేశారు. తణుకులోని చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
జాతీయ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
భీమవరం: జాతీయ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ఉపాధ్యాయుల అవార్డుల స్వీయప్రతిపాదన కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ముగిసిన డీఎస్సీ పరీక్షలు
భీమవరం: జిల్లాలో డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మూడు పరీక్షా కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన పరీక్షకు 98 శాతం హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఉదయం పరీక్షకు 385 మందికి 380 మంది హాజరుకాగా మధ్యాహ్నం 383 మందికి 378 మంది హాజరయ్యారన్నారు.

మున్సిపల్ హైస్కూల్ తనిఖీ