
ఆక్వా రైతుల ఆందోళన
యలమంచిలి: అప్రకటిత విద్యుత్ కోతలతో నష్టపోతున్నామని చించినాడ గ్రామానికి చెందిన ఆక్వా రైతులు శనివారం కాజ పడమర గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. అర్థరాత్రి సమయంలో కనీస సమాచారం లేకుండా కోతలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చించినాడ లంకలో వర్షం కురిస్తే నడిచి వెళ్లడానికి కష్టంగా ఉందన్నారు. కనీస సమాచారం లేకుండా విద్యుత్ కోత విధించడంతో చెరువుల వద్దకు వెళ్లి జనరేటర్స్ వేసుకోవడం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి వెంటనే లైన్‌మెన్‌ను నియమించాలని, ఇకపై విద్యుత్ కోతలు ఉంటే సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రికల్ ఏఈ కిరణ్‌కు వినతిపత్రం ఇచ్చారు.
తిరువన్నామలైకు ప్రత్యేక రైలు
పాలకొల్లు సెంట్రల్: నరసాపురం నుంచి తిరువన్నామలై (అరుణాచలం)కు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ డీఆర్‌యుసీసీ సభ్యుడు జక్కంపూడి కుమార్ తెలిపారు. నరసాపురం నుంచి అరుణాచలం 07219 నెంబరు, అరుణాచలం నుంచి నరసాపురం 07220 నెంబరుతో రైలు నడుస్తుందన్నారు. నరసాపురం నుంచి ప్రతి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు అరుణాచలం చేరుకుంటుందన్నారు. అరుణాచలంలో గురువారం ఉదయం 11 గంటలకు బయలుదేరి శుక్రవారం ఉదయం 3 గంటలకు నరసాపురం చేరుకుంటుందన్నారు. 8 వారాలు పాటు ఈ ప్రత్యేక రైలు నడుస్తుందన్నారు.