
తగ్గని పుస్తకాల మోత
భీమవరం: విద్యార్థులకు పుస్తకాల బరువు తక్కువగా ఉండేలా ప్రభుత్వం నిబఽంధనలు పెట్టినా ప్రైవేటు విద్యా సంస్థలు వాటిని పట్టించుకోవడం లేదు. ర్యాంకులు, ఫస్ట్‌క్లాస్‌లంటూ విద్యార్థులపై ఒత్తిడి పెంచి ఉదయం ఆరు గంటలకే తరగతులు ప్రారంభించి రాత్రి వరకు పుస్తకాలను బట్టీ పట్టిస్తున్నారు. పుస్తకాల బరువుతో అనేక సమస్యలకు గురవుతున్నారంటూ అధ్యయనంలో తేలినా.. విద్యార్థులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. ఏ క్లాస్‌కు ఎన్ని పుస్తకాలు ఇవ్వాలో ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య, నోటు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రైవేటు విద్యాసంస్థలో విద్యార్థులకు మాత్రం బ్యాగ్‌ల బరువు తగ్గడం లేదు.
విద్యా సామగ్రి విక్రయిస్తున్న ప్రైవేటు స్కూళ్లు
విద్యా శాఖ లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 20 మండలాల పరిధిలో చిన్నా, పెద్ద ప్రైవేటు విద్యా సంస్థలు 435 వరకూ ఉన్నాయి. వీటిలో 96 ప్రైమరీ, 190 అప్పర్ ప్రైమరీ, 209 హైస్కూళ్లు ఉన్నాయి. తల్లికి వందనం పథకం ప్రైవేటు స్కూల్ విద్యార్థులకు కూడా వర్తింపచేయడంతో ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివించడానికి మక్కువ చూపుతున్నారు. దీంతో ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేయడమేగాక విద్యాసామగ్రి కూడా స్కూళ్ల వద్దనే విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విద్యా సంస్థలు విద్యా సామగ్రి అమ్మకూడదనే నిబంధనలు గాలికి వదిలి విచ్చల విడిగా పుస్తకాలు, యూనిఫాం, బ్యాగ్‌లు వంటివి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. విద్యాసామగ్రి విక్రయాలపై విద్యా శాఖ మొక్కుబడి దాడులు చేయడం మినహా కఠిన చర్యలు తీసుకున్న సంఘటనలు లేవు.
నిబంధనల ప్రకారం పుస్తకాలు ఇలా..
ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు రెండు పుస్తకాలు, 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు నాలుగు, 6, 7తరగతులకు 8 పుస్తకాలు, 8వ తరగతికి 10, 9వ తరగతికి 12, టెన్త్ క్లాస్ విద్యార్థులకు 14 పుస్తకాలు మాత్రమే వినియోగించాల్సివుంది. దీంతో బ్యాగ్ బరువు తగ్గి విద్యార్థులకు ఊరట కలుగుతుంది. ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రం నిబంధనలు లేకుండా ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు 8 పుస్తకాల వరకు కొనుగోలు చేయిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కేవలం 6.5 లక్షల పాఠ్యపుస్తకాలు మాత్రమే పంపిణీ చేస్తే ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థులకు దాదాపు 15 లక్షల పుస్తకాలకు పైగా వినియోగిస్తున్నారని అంచనా. పుస్తకాల బరువుతో ఆరోగ్య సమస్యలే గాకుండా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు పాటించాలి
నిబంధనల ప్రకారం పుస్తకాలు బరువు తగ్గించాల్సిందే. దానిలో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు తక్కువ సంఖ్యలోనే నోట్ పుస్తకాలు పంపిణీ జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్స్ కూడా అదే విధంగా నోటు పుస్తకాలు కొనుగోలు చేసుకునేలా తల్లిదండ్రులకు సూచించాలి. ప్రైవేట్ స్కూళ్ల వద్ద విద్యా సామగ్రి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు.
– ఈ.నారాయణ,
జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం
ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోని ప్రైవేటు స్కూళ్లు
బ్యాగ్‌లు మోయలేక చిన్నారుల అవస్థలు

తగ్గని పుస్తకాల మోత