స్నేహితుడే హంతకుడు | - | Sakshi
Sakshi News home page

స్నేహితుడే హంతకుడు

Jul 3 2025 7:43 AM | Updated on Jul 3 2025 4:45 PM

స్నేహితుడే హంతకుడు

స్నేహితుడే హంతకుడు

కీలకమైన హత్య కేసును ఛేదించిన పోలీసులు

డీఎన్‌ఏ రిపోర్టు ఆధారంగా దర్యాప్తు

వివరాలు వెల్లడించిన ఎస్పీ నయీం అస్మి

నరసాపురం: గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించి, సదరు వ్యక్తి హత్య చేయబడ్డాడని నరసాపురం పోలీసులు నిర్ధారించారు. లోతైన దర్యాప్తు జరిపి హత్యగా తేల్చడమే కాకుండా డీఎన్‌ఏ రిపోర్టు ఆధారంగా మృతుడిని గుర్తించడం విశేషం. దీనికి సంబంధించి వివరాలను బుధవారం ఎస్పీ నయీం అస్మి నరసాపురం డీఎస్పీ కార్యాలయంలో వెల్లడించారు.

పంట కాలువలో లభించిన మృతదేహం

నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలో డంపింగ్‌ యార్డ్‌ సమీపంలో పంట కాలువలో ఈ ఏడాది జనవరి 27వ తేదీన సుమారు 30 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తొడ ఎముక, మరికొన్ని లోపలి అవయవాలను పోస్టుమార్టం సమయంలో భధ్రపరిచారు. పోస్టుమార్టం నివేదికలో అతను నీటిలో పడిపోవడం వల్ల చనిపోలేదని తేలింది. పొట్టలో కుడివైపు గాయాలు కూడా ఉండటంతో హత్యచేసి పడేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

ఫోరెన్సిక్‌ ఆధారాలతో మృతుడి గుర్తింపు

పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హత్యపై కూపీ లాగారు. ముందుగా ఉభయగోదావరి జిల్లాలు, పక్క జిల్లాల్లో నమోదైన మిస్సింగ్‌ కేసులు, అందులో గుర్తించిన వారి వివరాలు సేకరించారు. పెరవలి పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదై గుర్తింపు లభించని చుక్కల శ్రీనివాస్‌ విషయంలో దృష్టి పెట్టారు. శ్రీనివాస్‌ తల్లితండ్రుల డీఎన్‌ఏలను సేకరించి, మృతుడి భధ్రపరిచిన ఎముక డీఎన్‌ఏ ద్వారా సరిచూసి మృతుడు శ్రీనివాస్‌గా నిర్ధారించారు.

హత్యగా గుర్తించింది ఇలా

పెరవలి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన చుక్కల శ్రీనివాస్‌ (37) డీఎస్సీకి ప్రిపేరవుతున్నాడు. అయితే అతని స్నేహితులు, దినచర్య వంటి అంశాలపై పోలీసులు దృష్టిపెట్టి విచారణ చేశారు. శ్రీనివాస్‌తో అత్యతం సన్నిహితంగా ఉండే పెరవలి మండలం కాకరపర్రుకు చెందిన పూల వ్యాపారి మల్లెపూడి శ్రీనివాస్‌ను అనుమానంతో అదపులోకి తీసుకుని విచారించగా అతడే చంపినట్టు తెలిసింది.

స్నేహితుడే చంపేసి కాలువలో పడేశాడు

చుక్కల శ్రీనివాస్‌ డీఎస్సీకి ప్రిపేర్‌ కావడానికి రాజమండ్రి వెళతానని స్నేహితుడు మల్లెపూడి శ్రీనివాస్‌కు చెప్పాడు. అయితే వెళ్లొద్దని స్నేహితుడితో ఓసారి గొడవపడ్డాడు. మళ్లీ 2025 జనవరి 3వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో దువ్వ గ్రామం నుంచి ఒకే మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా ఇదే విషయంపై మళ్లీ ఇద్దరూ వాదులాడుకున్నారు. పెరవలి సమీపంలో ప్లేబాయ్‌ ఫ్యాక్టరీ వద్ద నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి మోటార్‌సైకిల్‌ను తీసుకెళ్లి అక్కడ కొంతసేపు వాదులాకున్నారు. ఈ క్రమంలో మల్లెపూడి శ్రీనివాస్‌ బీర్‌బాటిల్‌ పగలకొట్టి చుక్కల శ్రీనివాస్‌ పొట్టలో కుడివైపుపొడిచి హత్య చేశాడు. కాళ్లు, చేతులు కట్టి, దుస్తులు తొలగించి శవాన్ని పెరవలి కాలువలోకి తోసేశాడు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే హత్య చేసిన ప్రదేశం నుంచి శవాన్ని కాలువలోకి నెట్టిన ప్రాంతం 3 కిలోమీటర్లు. 24 రోజుల తరువాత శవం దాదాపు 42 కిలోమీటర్లు దూరంలో కొప్పర్రు గ్రామంలో బయటపడటం మరో అంశం. ఇది దాదాపు అసాధ్యమైన కేసని వైద్య పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కేసు ఛేదించినట్లు ఎస్పీ చెప్పారు. విలేకరుల సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ భీమారావు, నరసాపురం డీఎస్పీ డాక్టర్‌ బి.శ్రీవేద ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement