
మూలనపడ్డ 108.. ప్రైవేటు వాహనంలో తరలింపు
తణుకు అర్బన్: లారీ కిందపడి వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం తణుకులో జరగగా.. స్థానికులు 108కు ఫోన్ చేసినప్పటికీ ఎంత సేపటికీ వాహనం రాలేదు. దీంతో ప్రైవేటు వాహనంలో ఆస్పత్రికి తరలించారు. సజ్జాపురానికి చెందిన దూసనపూడి దుర్గాప్రసాద్‌ను లారీ ఢీకొట్టింది. అతని కాలు నుజ్జయ్యింది. 108 రాకపోవడంతో స్థానికులు ప్రైవేటు వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ నుంచి రాజమండ్రికి తరలించారు. తణుకు 108 వాహనం కొన్ని రోజులుగా మరమ్మతుల్లో ఉంది. దీంతో ఇరగవరం, ఉండ్రాజవరం వాహనాలను ఉపయోగిస్తున్నారు. ఆ రెండు వాహనాలు కూడా దూరప్రాంతాలకు వెళ్లడంతో తణుకులో 108 వాహన సేవలు అందుబాటులో లేవు.
డీఎస్సీ పరీక్షకు 97 శాతం హాజరు
భీమవరం: జిల్లాలో మూడు పరీక్షాకేంద్రంలో మంగళవారం నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షకు 97 శాతం హాజరయ్యారని జిల్లా విద్యా శాఖాధికారి ఇ.నారాయణ చెప్పారు. ఉదయం పరీక్షకు 385 మందికి 372 మంది, మధ్యాహ్నం పరీక్షకు 386 మందికి 378 మంది హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని నారాయణ తెలిపారు.
ఎంపీడీఓల సంఘం కార్యవర్గ ఎన్నిక
భీమవరం అర్బన్: భీమవరంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎంపీడీఓ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎంపీడీఓ ఎన్.గంగాధరరావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ సంఘం అధ్యక్షుడిగా బీఎస్‌ఎస్‌ఎస్ కృష్ణ మోహన్, ప్రధాన కార్యదర్శిగా ఎన్. గంగా ధరరావు, ఉపాధ్యక్షులుగా డాక్టర్ జి.స్వాతి, ఎ. శ్రీనివాస్, కోశాధికారిగా సీహెచ్ త్రిశూలఫణి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎంవీఎస్‌ఎస్ శ్రీనివాస్, ప్రచార కార్యదర్శిగా టీఎస్ మూర్తి, సంయుక్త కార్యదర్శిగా పి.శామ్యూల్‌ను ఎన్నుకున్నారు.
సమ్మెకు మద్దతివ్వాలి
కొయ్యలగూడెం: కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల తొమ్మిదిన చేపట్టే దేశవ్యాప్త సమ్మెకు ప్రజలు మద్దతివ్వాలని ఏపీ అంగన్ వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు. మంగళవారం కొయ్యలగూడెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు ప్రసంగించారు. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలతో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చి కార్మిక వర్గంపై బానిసత్వం రుద్దేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి భారతి కోరారు. అనంతరం బయ్యనగూడెం, పొంగుటూరు, కొయ్యలగూడెం సెక్టార్ కమిటీల ఎన్నికలు నిర్వహించారు.
వరదను ఎదుర్కొనేందుకు
అప్రమత్తంగా ఉండాలి
ఏలూరు(మెట్రో): గోదావరి వరదను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు విపత్తు నియంత్రణ కార్యాచరణను పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో గోదావరి వరద నియంత్రణ, సహాయక చర్యలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడంతోపాటు మండల స్థాయిలో రెవెన్యూ, పోలీసు, విద్యుత్, ఫైర్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారుల పేర్లు, అత్యవసర ఫోన్ నెంబర్లు సిద్ధంగా ఉంచాలన్నారు. 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలన్నారు. కుక్కునూరు, వేలేరుపాడులో మొదటి, రెండవ, మూడో వరద ప్రమాద హెచ్చరికలకు అనుగుణంగా పునరావాస కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 8, 9 నెలలు నిండిన గర్బిణీల జాబితాను సిద్ధం చేసి సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.