
వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి చేయాలి
ఏలూరు టౌన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాబోయే కాలంలో ఏలూరు జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ.. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై సమష్టిగా పోరాటం చేసి ప్రజలకు అండగా నిలవాలని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నాయకుడు కోటగిరి శ్రీధర్ అన్నారు. ఏలూరులోని ఆయన ఇంట్లో దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఏలూరు పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేసేలా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి అరాచకాలు, పార్టీ నేతలపై అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలపై ప్రజలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. కూటమి నేతలు సూపర్ –6 హామీలు అమలు చేయలేక, ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, గత వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రజలకు ఏ విధంగా మేలు చేశామనేది ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్ గురునాథ్, బీసీ సెల్ నగర అధ్యక్షులు కిలాడి దుర్గారావు పాల్గొన్నారు.