
మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామివారికి ఆలయ అర్చకులు ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో బారులుదీరి స్వామివారిని దర్శించి, 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,75,143 సమకూరినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. సుమారు 1400 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేసినట్లు చెప్పారు. ఆలయం వద్ద బొర్రంపాలెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది వైద్య శిబిరం నిర్వహించారు.
తాడేపల్లిగూడెంలో చోరీ
తాడేపల్లిగూడెం అర్బన్ : పట్టణంలోని ఝాన్సీరాణి ఆస్పత్రి సమీపంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి రూ.7 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు అపహరించారు. వివరాల ప్రకారం సుబ్బారావు పేటలో ఉంటున్న బల్ల వేణువర్మ, లలిత గత నెల 24వ తేదీన తిరుమల తిరుపతి వెళ్లి మంగళవారం వచ్చారు. ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండడం, ఇంటిలోని వస్తువులు చిందర వందరగా పడి ఉండడంతోపాటు బీరువాలో దాచిన ఆరు కాసుల బంగారు నగలు, కిలో వెండి సామగ్రి కనిపించలేదు. దీంతో బాధితురాలు బల్ల లలిత స్థానిక పట్టణ పోలీస్‌స్టేసన్‌లో ఫిర్యాదు చేయగా ఎసై నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
నరసాపురం: పట్టణ పరిధిలోని నరసాపురం–నిడదవోలు ప్రధాన పంట కాలువలో మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పంటకాలువలో మహిళ మృతదేహం ఉన్నట్టుగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టౌన్ సీఐ బి.చాదగిరి, ఎస్సై జయలక్ష్మి అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతురాలి వయస్సు సుమారు 53 సంవత్సరాలు ఉంటుందని సీఐ వివరించారు. పోస్టుమార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వివరించారు.

మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు