పేద విద్యార్థులకు వైఎస్సార్ వరం నూజివీడు క్యాంపస్‌లో 2008 బ్యాచ్ విద్యార్థుల మనోగతం ముగిసిన మొదటి బ్యాచ్ ఉద్యోగుల సమ్మేళనం
వారంతా పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తేనే కుటుంబ జీవనం సాగుతుంది. ప్రతిభ ఉన్నా ఆర్థిక సహకారం లేక అందుబాటులో ఉన్న విద్యతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇదే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ఐటీలు వారి జీవితాలను పూర్తిగా మార్చేశాయి. పేద వర్గాలకు చెందిన ప్రతిభ గల విద్యార్థులకు చేయందించి.. ఆరేళ్లపాటు రూపాయి ఖర్చు లేకుండా సమీకృత ఇంజనీరింగ్ విద్యను అందించడంతో దానిని అందుకున్న విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కొలువులు సాధించారు. దీంతో ఒకప్పుడు ఆర్థిక కష్టాల్లో ఉన్న వారంతా నేడు పేదరికంలో నుంచి బయటకు వచ్చారు. ఇదంతా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ఐటీల వల్లే సాధ్యమైందని పూర్వ విద్యార్థులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో రెండు రోజుల పాటు నిర్వహించిన తొలి బ్యాచ్ 2008–14 విద్యార్థుల సమ్మేళనం ఆదివారం కూడా ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు నాటి తమ పరిస్థితులను వివరించారు.
– నూజివీడు
కొత్త ఇల్లు కట్టుకున్నాం
ప్రకాశం జిల్లా దొనకొండ మండలం భూమానపల్లి మా సొంతూరు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లేవారు. రెక్కాడితేనే గానీ డొక్కాడని కుటుంబం మాది. 2008లో ట్రిపుల్‌ఐటీలో సీటు రావడంతో అక్కడే సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. 2017లో మున్సిపాలిటీలో ఏఈఈ ఉద్యోగం వచ్చింది. దీంతో మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు కొత్త ఇల్లు కూడా కట్టుకున్నాం. ట్రిపుల్‌ఐటీలో చదువుకోవడం వల్లే మా పేద కుటుంబంలో మార్పు వచ్చింది.
– మురికిపూడి మరియదాసు
ఫీజు కట్టలేని కుటుంబం మాది..
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం భోగోలు మా ఊరు. పూరింట్లో ఉండేవాళ్లం. అమ్మానాన్న కూలి పనులకు వెళ్లేవారు. ట్రిపుల్‌ఐటీ అనేది ఒకటి ఉందనే విషయమే తెలియదు. దరఖాస్తు చేయకుండానే సీటు వచ్చింది చేరమంటూ కాల్ లెటర్ వచ్చింది. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశా. 2020లో ఆర్‌ఎస్సైగా ఉద్యోగం వచ్చింది. మంచి ఇల్లు కట్టి అమ్మానాన్నలకు బహుమతిగా ఇచ్చా. ట్రిపుల్‌ఐటీ లేకపోతే మా తల్లిదండ్రులు బయటి కాలేజీల్లో చదివించేవారే కాదేమో.
– తాడేపల్లి మౌనిక
వైఎస్సార్‌ని మరువలేం
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మా సొంతూరు. ఇందిరమ్మ ఇంట్లో ఉండేవాళ్లం. కూలి పనులకు వెళ్తేనే ఇల్లు గడిచేది. ట్రిపుల్‌ఐటీలో ఈసీఈ చేసిన తర్వాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశా. ఆ తర్వాత జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో ఎంటెక్ పూర్తి చేశా. 2018లో ఎస్సైగా ఎంపికయ్యా. ఇప్పుడు తెలంగాణ ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తున్నా. సొంతూరిలో ఇల్లు కట్టుకున్నా. ఆనందంగా బతుకుతున్నాం. వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని జీవితంలో మరిచిపోలేం.
– చారీ రాంబాబు
ట్రిపుల్‌ఐటీ చదువులు.. పేద కుటుంబాల్లో వెలుగులు
ట్రిపుల్‌ఐటీ చదువులు.. పేద కుటుంబాల్లో వెలుగులు
ట్రిపుల్‌ఐటీ చదువులు.. పేద కుటుంబాల్లో వెలుగులు