
ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
ముదినేపల్లి రూరల్: మండలంలోని పెనుమల్లి వద్ద శుక్రవారం ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. ఇందుకు ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామతులు ఆందోళనకు దిగడంతో రెండు గంటల పాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వివరాల ప్రకారం మండలంలోని సంఖర్షణపురానికిచెందిన ముత్యాల చక్రవర్తి(32), మరో ఐదుగురు కూలీలతో మినుము నూర్పిడి చేసేందుకు ట్రాక్టర్‌పై కూలి పనికి వెళ్తున్నారు. పెనుమల్లి సమీపానికి వెళ్లగానే మలుపు వద్ద డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాదం నుంచి ఐదుగురు కూలీలు తప్పించుకోగా ట్రాక్టర్‌పై ఉన్న మినుము నూర్పిడి యంత్రం చక్రవర్తిపై పడి తీవ్రగాయాలపాలయ్యాడు. ప్రమాద సమయంలో స్థానికులు ఎవ్వరూ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర గాయాలతో అరగంట సేపు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడాడు. సమాచారం అందుకున్న బంధువులు గుడివాడ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. చక్రవర్తి మృతదేహంతో గుడివాడ నుంచి బయల్దేరిన గ్రామస్తులు చక్రవర్తి కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన చేయాలని నిర్ణయించారు. సమాచారం తెలుసుకున్న పోలీసు సిబ్బంది గుడివాడ నుంచి వస్తున్న చక్రవర్తి మృతదేహాన్ని జాతీయ రహదారిపై కోడూరు వద్ద అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులకు, పోలీసులకు తీవ్ర వాగ్వివాదం జరిగింది. మృతుడి తరఫు వ్యక్తులకు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ తరఫు వ్యక్తులకు మధ్య రాజీ చర్చలు సఫలం కావడంతో ఆందోళన విరమించారు.

ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి