భీమవరం: స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్‌లో నిర్వహించిన ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నీస్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. 35,45, 55, 65, 75 ఏళ్ల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో నిర్వహించిన పోటీలు నిర్వహించారు. 45 ప్లస్ సింగిల్స్‌లో ఎంవీఎల్‌ఎన్ రాజు, 55 ప్లస్ సింగిల్స్‌లో మణిందన్, 65 ప్లస్ డబుల్స్‌లో ఆనందస్వరూప్, శ్రీనివాస్, 65 ప్లస్ సింగిల్స్‌లో వి.శ్రీనివాసరెడ్డి, 70 ప్లస్ సింగిల్స్‌లో సేతు, 70 ప్లస్ డబుల్స్‌లో సన్యాసిరాజు, గజపతి, 75 ప్లస్ డబుల్స్‌లో అశోక్‌రెడ్డి, సాయి రాంబాబు విజేతలుగా నిలిచారు. టోర్నమెంట్ విజేతలకు క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లూరి పద్మరాజు, పెన్మెత్స వెంకటరామరాజు, టోర్నమెంట్ సెక్రటరీ వీవీఎస్ సుబ్రహ్మణ్యంరాజు, ఎ.రాంబాబు బహుమతులు అందజేశారు.
ల్యాప్‌టాప్‌లు, టచ్ ఫోన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (టూటౌన్): అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్‌ట్యాప్‌లు, బదిరులకు టచ్ ఫోన్ల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ జిల్లా మేనేజరు బి.రామ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ మొదటి సంవత్సరం, పాలిటెక్నిక్, ఐటీఐ చదివే వారు వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 08812–234146 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
పంచాయతీ కార్యాలయంలో రూ.91 వేలు చోరీ
ఉంగుటూరు: స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో రూ.91 వేలు చోరీకు గురైంది. ఇంటి పన్నులు, కుళాయి పన్నులు వసూలు చేసిన బీరువాలో పెట్టి తాళం వేశారు. అయితే గురువారం ఉదయం ఆఫీసు తీసేసరికి బీరువా తాళం పగలగొట్టి ఉండడంతో పంచాయతీ కార్యదర్శి పరిశీలించి చోరీ జరిగిందని నిర్ధారించారు. ఈ మేరకు ఆయన పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్మాప్తు చేస్తున్నామని ఎస్సై సూర్యభగవాన్ తెలిపారు.
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా
ఏలూరు (టూటౌన్): యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో తలపెట్టిన ఉద్యోగుల సమ్మె వాయిదా పడినట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం అధ్యక్షులు డి.శ్రీనివాస్ మోహాన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఢిల్లీలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్, డిపార్ట్‌మ్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సెంట్రల్ లేబర్ కమిషన్ మధ్యన శుక్రవారం జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేశారని పేర్కొన్నారు.