సదస్సు తీర్మానాలివీ..
● అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా రైతుల వద్ద ఉన్న కోకో గింజలను కంపెనీలు వెంటనే కొనుగోలు చేయాలి.
● కంపెనీలు రైతులను నష్టపరిచే చర్యలను అరికట్టాలి.
● కంపెనీలు కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కోకో గింజలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.
● ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపజేయాలి.
● విదేశీ కోకో గింజలు, పొడి, బట్టర్ వంటి దిగుమతులు నిలుపుదల చేయాలి. మన రైతులను నష్టపరిచే పద్ధతుల్లో దిగుమతులు ఉండరాదు.
● కోకో రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణం చేయాలి.
● కోకో తోటలు సాగు చేస్తున్న రైతులకు ఉద్యాన శాఖ నుంచి రావాల్సిన సబ్సిడీ బకాయిలు చెల్లించాలి.
పెదవేగి : కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కోకో రైతుల రాష్ట్ర సదస్సు హెచ్చరించింది. గురువారం ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సును నిర్వహించారు. బొల్లు రామకృష్ణ, బోళ్ల సుబ్బారావు, ఈడ్పుగంటి శ్రీనివాసరావు అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన ఈ సదస్సులో కోకో రైతుల సమస్యలపై చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ తదితర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కోకో రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
కంపెనీల సిండికేట్‌తో దోపిడీ
కోకో గింజల కొనుగోలు కంపెనీలు సిండికేట్‌గా మారి రైతులను దోపిడీ చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.కేశవరావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 75 వేల ఎకరాల్లో కోకో తోటల సాగు ఉందని, ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో కోకో అంతర పంటగా ఉందని తెలిపారు. ప్రపంచ కోకో ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలోని 20 దేశాల్లో 20వ స్థానంలో ఉందని, మన దేశ అవసరాలకు తగిన విధంగా ఇక్కడ ఉత్పత్తి లేదని చెప్పారు. 80 శాతం కోకోను ఇతర దేశాల నుంచి మన దేశం దిగుమతి చేసుకుంటోందని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గత సంవత్సరం కంపెనీలు పోటీపడి అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా కిలో గింజలను రూ.1,040 వరకు ధర చెల్లించి కొనుగోలు చేశాయని గుర్తుచేశారు. ఈ ఏడాది కంపెనీలు సిండికేట్‌గా మారి అంతర్జాతీయ ధర ఇవ్వడం లేదని చెప్పారు. పైగా అన్ సీజన్ గింజలు కొనుగోలు చేయడం లేదని, సీజన్ కోకో గింజల ధర రోజురోజుకీ తగ్గించి వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కోకో రైతులు సంఘటితం కావాలి
కోకో రైతులంతా సంఘటితంగా లేకపోవడం వల్లే కంపెనీలు సిండికేట్‌గా ఇబ్బంది పెడుతున్నాయని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. నిల్వ ఉంచిన గింజలను పచ్చళ్లు పట్టుకోండి అంటూ రైతులను ఎగతాళి చేస్తూ కంపెనీలు మాట్లాడుతుండటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఈ సదస్సులో విజయరాయి ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త మాధవీలత, పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం పరిధి ఆయిల్ పామ్ రైతుల సంఘం అధ్యక్షుడు ఉండవల్లి వెంకటరావు, ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షుడు మున్నంగి సుబ్బారెడ్డి, కోకో రైతులు పాల్గొన్నారు.
24న ధర్నాలు, రాస్తారోకోలు..
కోకో రైతుల సమస్యలపై ఈ నెల 24, 25 తేదీల్లో ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించాలని, ఎంపీలు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందించాలని, సమస్యను పరిష్కరించకపోతే కోకో గింజలు కొనుగోలు చేస్తున్న కంపెనీల గోడౌన్ల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర సదస్సు పిలుపునిచ్చింది.
రాష్ట్రస్థాయి సదస్సులో తేల్చిచెప్పిన కోకో రైతులు
కోకో గింజల కొనుగోలు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్
విజయరాయిలోని సదస్సుకు పెద్ద సంఖ్యలో కోకో రైతుల హాజరు
ఆదుకోకోంటే ఉద్యమమే