పుష్కరం దాటినా పూర్తికాలే!
పిల్లర్లకే వరంగల్ కళాభవనం
వరంగల్: కళాకారులను ప్రోత్సహించేందుకు వరంగల్‌లో నిర్మించతలపెట్టిన కళాభవనం పిల్లర్లకే పరిమితమైంది. పుష్కర కాలం పూర్తయినా పనులు పూర్తికావడం లేదని కళాకారులు ఆందోళన చెందుతున్నారు. కాకతీయుల రాజధాని వరంగల్‌లో కళాభవనం (మినీ రవీంద్రభారతి) నిర్మించాలని కోరుతూ కళాకారులు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించారు. వీరి అభ్యర్థన మేరకు బహుళ సాంస్కృతిక కళాభవనం నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. కాగా, వరంగల్ పోచమ్మమైదాన్ సమీపంలో మల్టీపర్సస్ కల్చరల్ కాంప్లెక్స్ పేరిట నిర్మాణానికి రెండుసార్లు శంకుస్థాపన చేశారు. అప్పటి మంత్రిగా ఉన్న బస్వరాజు సారయ్య ముచ్చటగా మూడోసారి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. 24–05–2013లో రూ.నాలుగు కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఏడాదిలో నిర్మించాలన్న నిబంధనలతో టెండర్లు నిర్వహించగా హైదరాబాద్‌కు చెందిన శ్రీకో ప్రాజెక్టు నిర్మాణ సంస్థ పనులు దక్కించుకుంది. మొదటి విడత పర్యాటకశాఖ మంజూరు చేసిన కోటి రూపాయలతో పనులు ప్రారంభమయ్యాయి. బెస్మెంట్, పిల్లర్లు, జనరేటర్ రూం నిర్మించిన కాంట్రాక్టర్‌కు రూ.69.88 లక్షలు చెల్లించారు. నిధులు విడుదలైతేనే మిగిలిన పనులు చేస్తామని కాంట్రాక్టర్ భీష్మించుకున్నాడు.


