కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
కమలాపూర్: ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెప్పాలని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులదే విజయమని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. ఈ నెల 11న జరిగే పంచాయతీ ఎన్నికల్లో కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మాజీ వైస్ ఎంపీపీ, బీఆర్‌ఎస్ నాయకుడు బైరి దశరథంను ప్రకటించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రెండేళ్లలో తట్టెడు మట్టి కూడా పోయలేదని, ఇక్కడ జరిగిన అభివృద్ధి అంతా కేసీఆర్ చేసిందేనన్నారు. నేను ఈ ప్రాంతం నాయకుడిని అని చెప్పుకునే ఓ ప్రజాప్రతినిధి ఒక్కసారి ఓడిపోగానే వేరే ప్రాంతాల నుంచి పోటీ చేసేందుకు వెళ్లాడని విమర్శించారు. బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పీఏసీఎస్ చైర్మన్ సంపత్‌రావు, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణరావు, కేడీసీసీబీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, నాయకులు నవీన్‌కుమార్, ప్రదీప్‌రెడ్డి, అశోక్, చంద్రారెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, ఐలయ్య, వెంకటేశ్వర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బహిరంగ చర్చకు రావాలని
ఎంపీ ఈటలకు సవాల్
బీజేపీ బలపరిచిన వారిని గెలిపిస్తేనే మళ్లీ కేంద్రం నుంచి నిధులొస్తాయని ఎంపీ ఈటల రాజేందర్ అవగాహన లేకుండా మాట్లాడారని ఎమ్మెలే కౌశిక్‌రెడ్డి విమర్శించారు. 2019 నుంచి 2025 వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల కోట్ల పన్నులు కేంద్రానికి కట్టిందని, కేంద్రం మాత్రం రాష్ట్రానికి రూ.3 లక్షల పైచిలుకు కోట్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. దీనిపై కమలాపూర్ బస్టాండ్ వద్ద బహిరంగ చర్చకు రావాలని, తాను చెప్పింది అబద్ధమైతే ముక్కు భూమికి రాసి తప్పు అయిందని క్షమాపణ కోరతానని, లేదంటే ఈటల రాజేందర్ ముక్కు భూమికి రాస్తారా అని సవాల్ విసిరారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి


