తడి, పొడి చెత్తను వేరు చేయాలి
నగర మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: నగర స్వచ్ఛత కోసం తడి, పొడి చెత్తను వేర్వేరు బుట్టల్లో వేసి అందించాలని మేయర్ గుండు సుధారాణి విజ్ఞప్తి చేశారు. బుధవారం వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని 38వ డివిజన్ ఖిలా వరంగల్, 42వ డివిజన్ రంగశాయిపేటలో ఇంటింటా తడి, పొడి చెత్త వేరుపై మేయర్, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం మేయర్ సుధారాణి మాట్లాడుతూ నగర వ్యాప్తంగా 66 డివిజన్లలో ప్రతి డివిజన్‌కు ముగ్గురు వలంటీర్ల చొప్పున, ప్రతి స్వచ్ఛ ఆటోకు ఒకరిని నియమించి తడి, పొడి చెత్తను వేరు చేసి అందించేలా సూచిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేటర్లు గుండు చందన పూర్ణచందర్ , బైరబోయిన ఉమాదామోదర్ యాదవ్, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, హెచ్‌ఓ లక్ష్మారెడ్డి, టీఎంసీ రమేశ్, శానిటరీ సూపర్ వైజర్ గోల్కొండ శ్రీను, ఆస్కీ ప్రతినిధులు డాక్టర్ రాజ్‌మోహన్, అవినాష్ పాల్గొన్నారు.


