
అందిన పాఠ్య పుస్తకాలు
ప్రభుత్వ బడుల్లో 90 శాతం పంపిణీ పూర్తి
●
కొత్త పుస్తకాలు ఇచ్చారు..
గతంలో పాఠశాలలు తెరిచిన కొన్ని రోజుల తర్వాత పాఠ్య పుస్తకాలు ఇచ్చేవారు. ఈసారి ముందుగానే తరగతిలో ఉన్న వారందరికి కొత్త పుస్తకాలు అందించారు. దీంతో ప్రారంభం నుంచే విషయాల వారీగా ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. దీంతో రోజువారీగా పుస్తక పఠనంతో పాటు ప్రశ్నలకు జవాబులు రాసుకొని ఉపాధ్యాయులకు అప్పజెబుతున్నాం.
– చరణ్, 4వ తరగతి, నందిమళ్ల
పాత పుస్తకాలు ఇచ్చేవారు..
గతంలో కొత్త పాఠ్య పుస్తకాలు సకాలంలో రాకపోవడం, అరకొరగా రావడంతో ఉపాధ్యాయులు పాత పుస్తకాలు సరి చేసేవారు. ఈ ఏడాది మాత్రం తరగతిలో అందరికి కొత్త పుస్తకాలు ఇవ్వడంతో పాటు పాఠాలు కూడా బోధిస్తున్నారు. వీటితో పాటు ఒక జత యూనిఫాం కూడా ఇచ్చారు.
– రమ్య, 5వ తరగతి, నందిమళ్ల
90 శాతం పంపిణీ పూర్తి..
జిల్లాలో ఇప్పటి వరకు 90 శాతం మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశాం. మొత్తం 2,62,650 పాఠ్య పుస్తకాలు అవసరం ఉండగా.. 2,54,650 వచ్చాయి. మిగిలిన 8 వేల పుస్తకాలు వచ్చిన వెంటనే మండలాల వారీగా అన్ని పాఠశాలలకు పంపిణీ చేస్తాం. ఈసారి ముందస్తుగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడంతో రోజువారి తరగతుల నిర్వహణ కొనసాగుతోంది. దీంతో విద్యార్థులకు సకాలంలో సిలబస్ పూర్తవుతుంది.
– అబ్దుల్ ఘనీ, జిల్లా విద్యాధికారి
అమరచింత: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బడిబాట కార్యక్రమం కంటే ముందుగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలనే లక్ష్యం ఆచరణలో సాధ్యమైంది. ఈ విద్యాసంవత్సరం పాఠశాలలు తెరవక ముందే పాఠ్య పుస్తకాలు ఆయా మండలాల విద్యాధికారులకు చేరడం, వాటిని పాఠశాలల వారీగా తరలించడం వంటి కార్యక్రమాలు వేగంగా పూర్తయ్యాయి. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థులు బడులకు వచ్చిన వెంటనే వారి చేతికి పాఠ్య పుస్తకాలు అందించే కార్యక్రమాన్ని పూర్తి చేయడంతో ఇప్పటి వరకు 90 శాతం పంపిణీ పూర్తయిందని విద్యాధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో మొత్తం 2,62,650 పాఠ్య పుస్తకాలు అవసరం ఉండగా.. ఇప్పటి వరకు 2,54,650 రాగా పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్య ఆధారంగా సరఫరా చేశారు. విద్యార్థులకు ఈసారి పాఠ్య పుస్తకాలతో పాటు ఒకజత యూనిఫామ్‌ను సైతం ముందస్తుగా అందించారు. పాత, కొత్త విద్యార్థులందరికి పాఠ్య పుస్తకాలు సకాలంలో చేరడంతో తరగతుల నిర్వహణ సజావుగా సాగుతుందని, విద్యార్థులకు విషయాల వారీగా తరగతులు ప్రారంభించినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు.
బడిబాట కంటే ముందే..
పాఠశాలలు తెరవకముందే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించడంతో విద్యాధికారులు సఫలీకృతమయ్యారు. జూన్ 16 వరకు కొనసాగిన బడిబాటలో ఉపాధ్యాయులు పాఠశాల క్లస్టర్ల వారీగా విద్యార్థుల నమోదుతో పాటు డ్రాపౌట్ విద్యార్థులను బడికి రప్పించేందుకు ఇంటింటి ప్రచారం చేశారు.
జిల్లాలో 558 సర్కారీ పాఠశాలలు
సకాలంలో ప్రారంభమైన తరగతులు
ఒక జత యూనిఫామ్స్ కూడా..

అందిన పాఠ్య పుస్తకాలు

అందిన పాఠ్య పుస్తకాలు

అందిన పాఠ్య పుస్తకాలు