వనపర్తిటౌన్: పాలమూరుకు జరుగుతున్న అన్యాయంపై జూలై 5న పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సుకు పాలమూరు ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు అధికసంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని వేదిక ప్రతినిధులు వెంకటేశ్వర్లు, యోసేపు కోరారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్న దొడ్డి కొమురయ్య హాల్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 వరకు సదస్సు కొనసాగుతుందని.. పాలమూరు శాశ్వత వెనుకబాటుతనంపై చర్చించడానికి సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : బీజేపీ
వనపర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామాల్లో గడప గడపకు వివరిస్తూ పార్టీని బలోపేతం చేయాలని జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి కోరారు. ఆదివారం శ్రీరంగాపురం మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలన్నారు.
ప్రధాని మోదీ పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్‌గౌడ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్, సీనియర్ నాయకుడు కొమ్ము శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాములు, మండల ప్రధానకార్యదర్శి శివ, ఎల్లస్వామి, చరణ్, విరాట్, శివ, రాయన్నసాగర్ తదితరులు పాల్గొన్నారు.

జూలై 5న ‘పాలమూరు’ సదస్సు