
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
వనపర్తిటౌన్: ప్రజా ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో 36 మంది లబ్ధిదారులకు రూ.10,29,500 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి సహాయనిధి పేదల ఆరోగ్యానికి కొండంత అండగా నిలుస్తోందని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో సాయం అందజేశామని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని.. ఆరోగ్యశ్రీ లేనివారికి చికిత్స అనంతరం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా కొంత ఆర్థిక ఉపశమనం కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమళ్ల యాదయ్య, జిల్లా ప్రధానకార్యదర్శి చీర్ల జనార్దన్, మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షుడు సమద్ మియా, పట్టణ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ బాబా, పార్టీ పెద్దమందడి మండల అధ్యక్షుడు సి.పెంటన్న యాదవ్, ఏఐపీసీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగార్జున, నాయకులు ఆవుల చంద్రశేఖర్, రాగి అక్షయ్, కోళ్ల వెంకటేష్, రాగి వేణు, మణిగిళ్ల బాలరాజు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.