
కేంద్రాల నుంచి ధాన్యం తరలిస్తాం
పాన్‌గల్: కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన వరి ధాన్యం నిల్వలను వెంటనే లారీల్లో గోదాంకు తరలిస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గోదాంను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్‌తో కలిసి పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో యాసంగిలో అధిక దిగుబడి రావడం, సరిపడా మిల్లులు లేకపోవడం, లారీలు, హామీల కొరతతో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, అమరచింత, ఖిల్లాఘనపూర్ మండలాల్లో 80 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని.. పాన్‌గల్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల్లో ధాన్యం సేకరణ, తరలింపులో వేగం పెంచి రైతుల ఇబ్బందులు తొలగిస్తామని వివరించారు. కేంద్రాలకు తాలు, చెత్త లేకుండా నాణ్యమైన ధాన్యం తీసుకొస్తే మిల్లర్లు ఇబ్బందులకు గురిచేయరని చెప్పారు. మిల్లులు, గోదాంల వద్ద ఆర్‌ఐ స్థాయి అధికారిని నియమించి పర్యవేక్షణ చేస్తూ రోజు వారి నివేదిక తీసుకుంటామన్నారు. నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని.. దీంతో చిన్న, చిన్న సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో విండో డైరెక్టర్ ఉస్మాన్, కాంగ్రెస్‌పార్టీ మండల నాయకులు వెంకటేష్‌నాయుడు, రవికుమార్, మధుసూదన్‌రెడ్డి, తిరుపతయ్యసాగర్, రాముయాదవ్, విష్ణు, రామచంద్రయ్య, నరేందర్‌గౌడ్, దర్గయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.
కొనుగోళ్లలో వేగం పెంచుతాం
రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు