
బీచుపల్లిలో సీతారాములకు ప్రత్యేక పూజలు చేస్తున్న అర్చకులు
ఎర్రవల్లిచౌరస్తా: బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం సీతారాముల పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీమాన్ సుదర్శన్ నారాయణ్ ఆధ్వర్యంలో శిష్య బృందం ఐదవరోజు ఆలయంలో ఉదయం సుప్రభాతసేవ, తిరుప్పావై, తోమాల, నైవేద్యం, తీర్థప్రసాదగోష్టి నిర్వహించారు. అనంతరం విష్వక్షేనపూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, కలశపూజ, అభిషేకం, ఆభరణ సమర్పన, సామ్రాజ్య పట్టాభిషేకం, హోమం, పూర్ణాహుతి వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను అర్చకులు వేద మంత్రాల నడుమ నిర్వహించారు. ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు, అర్చకులు, పాల్గొన్నారు.
మన్యంకొండలో...
మహబూబ్‌నగర్ రూరల్: వసంత నవరాత్రి సందర్భంగా మన్యంకొండ దేవస్థానంలో శుక్రవారం స్వామివారి పట్టాభిషేకం కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన శేషవాహనంలో అమ్మ, స్వామి వార్లను గర్భగుడి నుంచి సభా మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం పురోహితులు పట్టాభిషేకం ఘట్టం, పఠనం నిర్వహించారు. అనంతరం తిరిగి గర్భగుడి వద్దకు తీసుకొచ్చి పూజలు చేశారు. చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి పాల్గొన్నారు.