
కొత్తకోటలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానం
అమరచింత: క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పురపాలికల్లోని వార్డుల్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. దీంతో ప్రభుత్వ స్థలాలను గుర్తించిన అధికారులు అనుకున్న సమయానికి ఒక్కటైనా ప్రారంభించాలని భావించి పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. పలు వార్డుల్లో ఇప్పటికి స్థలాలను గుర్తిస్తూ క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తుండగా.. మరికొన్ని చోట్ల ప్రభుత్వ స్థలాలు లభించకపోవడంతో ఎక్కడ ఏర్పాటు చేయాలో తెలియక అధికారులు, ప్రజాప్రతినిధులు సతమతమవుతున్నారు. జిల్లాలోని అయిదు పురపాలికల్లో ఇప్పటి వరకు 40కి పైగా క్రీడామైదానాలు ప్రారంభించిన అధికారులు.. మిగిలిన వాటిని త్వరగా పూర్తి చేయాలని వాటి కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు రెవెన్యూ అధికారులను ఆశ్రయిస్తున్నారు.
రూ.అయిదు లక్షలతో..
ఒక్కో క్రీడా మైదానం ఏర్పాటుకుగాను ప్రభుత్వం రూ.అయిదు లక్షలు విడుదల చేసింది. ఎకరం స్థలం సేకరించి వాలీబాల్, ఖో–ఖో, కబడ్డీ, లాంగ్‌జంప్, హైజంప్ కోర్టులు, వ్యాయామం చేసేందుకు కావాల్సిన సామగ్రిని సమకూర్చాలి.
వేధిస్తున్న స్థలాల కొరత..
పురపాలికలోని చాలావార్డుల్లో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేవు. డబ్బులు వెచ్చించి స్థలాలు కొనుగోలు చేసి ఎలా ఏర్పాటు చేయాలని పుర పాలకవర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. కొన్ని వార్డుల్లో స్థలాలు గుర్తించినా.. నిర్మాణాల్లో స్థానికుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు కౌన్సిలర్లు చెబుతున్నారు.
స్థలాలు గుర్తిస్తున్నాం..
పట్టణంలోని 10 వార్డుల్లో రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తున్నాం. ఇప్పటి వరకు ఏడు వార్డుల్లో పూర్తికాగా.. 8, 9, 10 వార్డుల్లో ప్రభుత్వ స్థలాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయం కోసం ఉన్నతాధిరులకు నివేదించాం. – మహ్మద్ ఖాజా,
పుర కమిషనర్, అమరచింత
త్వరలో పూర్తి చేస్తాం..
పట్టణంలో ఇప్పటి వరకు 13 క్రీడా మైదానాలు పూర్తి చేశాం. మరో ఆరు పురోగతిలో ఉన్నాయి. మిగిలిన వార్డుల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించి పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.
– విక్రమసింహారెడ్డి, పుర కమిషనర్, వనపర్తి
మున్సిపాలిటీల్లో అసంపూర్తిగా క్రీడా మైదానాలు
నత్తనడకన పనులు
ఆర్భాటమే తప్పా.. కనిపించని పురోగతి

పెబ్బేరులోని క్రీడామైదానం

