
ఆర్‌జేడీకి పీఆర్‌టీయూ నాయకుల వినతి
పార్వతీపురం: పాఠశాలల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై రీజనల్ డైరెక్టర్ బి.విజయ్ భాస్కరరావుకు పీఆర్‌టీయూ నాయకులు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు పార్వతీపురం జీజే కళాశాలను ఆర్‌జేడీ సందర్శించిన సందర్భంగా వినతిపత్రాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ బేసిక్ ప్రైమరీ పాఠశాలలకు విద్యార్థుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. బదిలీల ప్రక్రియ ముగిసిన తరువాత కూడా పలు పాఠశాలలకు ఉపాధ్యాయులు లేక బోధనకు ఇబ్బంది కలుగుతోందన్నారు. ఆర్‌జేడీని కలిసిన వారిలో ఆ సంఘం నాయకులు వి.తవిటినాయుడు, కె.విజయ్, ఎ.సూర్యనారాయణ, జె.రామినాయుడు, జి.రామినాయుడు, శంకరరావు, తదితరులు ఉన్నారు.
పీఆర్‌టీయూ బలోపేతానికి కృషిచేయాలి
పార్వతీపురం: పీఆర్‌టీయూ బలోపేతానికి ఉపాధ్యాయులు కృషిచేయాలని ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అమరాపు సూర్యనారాయణ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం పార్వతీపురం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషిచేస్తున్నట్లు చెప్పారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సంఘం ఆదేశాలమేరకు కార్యక్రమాలు నిర్వహించనున్నామని అందుకు అందరు ఉపాధ్యాయులు సంసిద్ధంగా ఉండాలని కోరారు. సమావేశంలో పార్వతీపురం, కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతానగరం మండలాల నుంచి సంఘం సభ్యులు పాల్గొన్నారు.