
రెక్కీ నిర్వహించి హత్య
బొబ్బిలి: తన భార్య చనిపోవడానికి, బిడ్డ అనారోగ్యంతో ఉండడానికి తన పక్కింట్లో ఉంటున్న పిన్నే కారణమని అనుమానించి రెక్కీ నిర్వహించి మరీ ఆమెను హత్య చేశాడో ఓ యువకుడు. బొబ్బిలి పట్టణంలోని బండారు వీధిలో కరగాని పద్మ అనే మహిళ గాయాలతో బుధవారం ఇంటి గుమ్మం వద్ద పడి మృతి చెందిన ఘటన తెలిసిందే. కాగా ఇది హత్యేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ విషయమై డీఎస్పీ జి.భవ్యారెడ్డి గురువారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ మహిళ మృతి చెందడానికి కత్తిపీటపై పడిపోవడమేనని కుటుంబసభ్యులు చెప్పిన మాటలపై నమ్మకం కలగక దర్యాప్తు చేపట్టామన్నారు. వంటిపై గాయాలుండడం, మెడికల్ రిపోర్టు, క్లూస్‌టీమ్ వివరాలను సేకరించి హత్య అని నిర్ధారణకు వచ్చామని డీఎస్పీ చెప్పారు. హత్య చేసింది స్వయానా ఆమె బావ కుమారుడు కరగాని సంతోష్ కుమార్ అని తెలిపారు. సంతోష్ కుమార్ భార్య పావని ప్రసవ సమయంలో చనిపోయింది. అలాగే నెలన్నర రోజుల పసిబిడ్డ ఆరోగ్యం కూడా బాగాలేక ఆస్పత్రిలో చేర్చారు. ఈ రెండు సంఘటనలకు తన పిన్నే కారణమని భావించిన సంతోష్ గురువారం ఉదయం 11 గంటల సమయంలో రెక్కీ నిర్వహించాడు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇంట్లో పిన్ని ఒంటరిగా ఉన్న సమయంలో పొడిచి హత్యకు పాల్పడినటుల డీఎస్పీ చెప్పారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం బంధువులకు గురువారం అప్పగించామని, నిందితుడ్ని రిమాండ్ నిమిత్తం తరలించినట్లు తెలిపారు. సమావేశంలో సీఐ కె. సతీష్‌కుమార్, ఎస్సై ఆర్.రమేష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
మహిళ హత్య కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ