
గంజాయి అక్రమ రవాణా నివారణకు తనిఖీలు
పార్వతీపురం రూరల్: ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించే రైళ్లలో గురువారం విస్తృత తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్ నుంచి గుంటూరు ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ఈగల్ స్పెషల్ ఫోర్స్, లోకల్ పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జీఆర్పీ సమన్వయంతో డ్రోన్ కెమెరాలను ఉపయోగించి తనిఖీలు చేపట్టినట్లు పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురానా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాను నిరోధించడంలో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ముందుగా ప్లాట్‌ఫాంపై వేచిఉన్న ప్రయాణికుల లగేజీలను పలు శాఖల పోలీస్ అధికారులతో కలిసి డాగ్ స్క్వాడ్‌తో పరిశీలించారు. అనంతరం గుంటూరు ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో బోగీల వారీగా ముమ్మరంగా విజయనగరం వరకు సిబ్బంది తనిఖీలు చేశారు. ఎప్పటికప్పుడు మాదక ద్రవ్యాల నివారణకు ఈగల్ బృందం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పోలీసు శాఖలో పలు బృందాల సహకారంతో విస్తృతంగా తనిఖీలు చేపటుతున్నట్లు ఏఎస్పీ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, సాగు, వినియోగం లేకుండా చేయడమే ఈగల్ బృందం ప్రధాన లక్ష్యమన్నారు. తనిఖీల్లో క్రైమ్‌స్టేషన్ సీఐ అప్పారావు, పార్వతీపురం రూరల్ సీఐ గోవిందరావు, మరికొంతమంది ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
పలు శాఖల సమన్వయంతో రైళ్లలో సోదాలు
ఏఎస్పీ అంకిత సురానా