
కళ్లకు గంతలతో నిరసన
శృంగవరపుకోట: జిందాల్ పరిశ్రమ కళ్లు మూసి జెల్ల కొట్టిందని, తడి గుడ్డతో రైతుల గొంతు కోసిందని నిర్వాసిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ రఘురాజు నివాసం వద్ద మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో రోడ్డుమీద కళ్లకు గంతలు కట్టుకుని జిందాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిందాల్‌తో చేతులు కలిపి అన్ని పార్టీల నాయకులు, జిల్లా అధికారులు తమను కళ్లు మూసి జెల్ల కొట్టారని, జిందాల్ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారని, వాపోయారు. జిల్లా పెద్దదిక్కు అయిన కలెక్టర్ తన ఉద్యోగం మరిచిపోయి జిందాల్ ప్రతినిధిలా మాట్లాడటం విద్డూరంగా ఉందని, నాడు నమ్మించి ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్యేలు, మంత్రులు నాలుగు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పి వెళ్లిపోయారని, ఇప్పటికీ ముఖం చూపడం లేదన్నారు. నాడు జిందాల్ ఇచ్చిన హామీలు ఎవరు తీరుస్తారు? ఎలా తీరుస్తారని అడిగితే చెప్పకుండా ముఖం చాటేయడం న్యాయమా? జీవనోపాధి అయిన భూములు కోల్పోయి న్యాయం అడిగితే మమ్మల్ని పోలీసుల్ని పెట్టి బెదిరిస్తున్నారని వాపోయారు. కార్యక్రమంలో పలువురు రైతులు, మహిళలు పాల్గొన్నారు.
కలెక్టర్, ఎస్పీలకు ఎమ్మెల్సీ లేఖ
జిందాల్ భూసమస్య చుట్టూ తతెత్తుతున్న పరిస్థితి అర్దం చేసుకోవాలని, తొలుత నిర్వాసితుల శాంతియుత నిరసనకు అనుమతించి తర్వాత వారిని అనుమతించక పోవడం వల్ల నిర్వాసితులు తన ఇంటికి వస్తున్నారని, స్థానికుడిని కావడం వల్ల వారిని కాదనలేక విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఎమ్మెల్సీ రఘురాజు అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో వారి అభిప్రాయాలు వ్యక్తం చేసుకోవడానికి అనుమతించి, తనపై ఒత్తిడి తగ్గించాలని ఎమ్మెల్సీ రఘురాజు కలెక్టర్, ఎస్పీలకు లేఖలు ఇచ్చారు.
జిందాల్ మోసం చేసిందని నిర్వాసితుల ఆందోళన