
కౌన్సిలర్ల అధికారాలు కత్తిరిస్తా..
నెల్లిమర్ల: నెల్లిమర్ల నగర పంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశం కోరం లేక వాయిదాపడింది. సమావేశానికి ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, చైర్‌పర్సన్ బంగారు సరోజిని, జనసేన కౌన్సిలర్లు జానా సంధ్యారాణి, పాండ్రంకి మహాలక్ష్మి, బీజేపీ కౌన్సిలర్ మైపాడ ప్రసాద్ మాత్రమే హాజరయ్యారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు హాజరుకాలేదు. సమావేశం వాయిదా పడడంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయారు. టీడీపీ కౌన్సిలర్లు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమావేశపు అజెండా నచ్చకపోతే హాజరై, చర్చించాలే తప్ప బహిష్కరించడం సరికాదన్నారు. టీడీపీ సభ్యుల తీరును ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తానని చెప్పారు. ఇక్కడి పరిస్థితులు కూలంకషంగా వివరిస్తానని పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్‌లో అవకతవకలను సైతం టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హెచ్చ రించారు. అవసరమైతే నగర పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్‌ను నియమించి, కౌన్సిలర్ల అధికారాల తొలగింపునకు సిఫారసు చేస్తానన్నారు. కార్యక్రమంలో కమిషనర్ తారక్‌నాథ్, తదితరులు పాల్గొన్నారు.
కూటమిలో కుంపటి
నెల్లిమర్ల నగరంలో అధికార పార్టీ కౌన్సిలర్లే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే నాగమాధవి హాజరైన సమావేశాలకు గైర్హాజరై తమ వ్యతిరేకతను వ్యక్తంచేస్తున్నారు. నెల్లిమర్ల నగర పంచాయతీ కౌన్సిల్‌ను పలుమార్లు బాయ్‌కాట్ చేసి తమ నిరనసను తెలియజేశారు. అందులో భాగంగా సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించారు.
ఎమ్మెల్యే నాగమాధవి
నగర కౌన్సిల్ సమావేశాన్ని కౌన్సిలర్లు బాయ్‌కాట్ చేయడంపై ఆగ్రహం
అన్నాక్యాంటీన్‌లో అవకతవకలను పెద్దల దృష్టికి తీసుకెళ్తానన్న ఎమ్మెల్యే
కోరం లేక సమావేశం వాయిదా