
800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
జియ్యమ్మవలస: మండలంలోని చినమేరంగి పరిసర ప్రాంతాల్లో సోమవారం దాడులు చేసి 800 లీటర్ల బెల్లం ఊటను పట్టుకుని ధ్వంసం చేసినట్లు చినమేరంగి ఎస్సై అనీష్ తెలిపారు. గ్రామాల్లో సారా, మద్యం అమ్మినా తెలియజేయాలని, అటువంటి వారిపేర్లు గోప్యంగా ఉంచుతామని ఎస్సై ప్రజలకు సూచించారు.యువత చెడువ్యసనాలకు బానిసకావద్దని హితవు పలికారు. సారా తయారీకి ఉపయోగించిన సామగ్రిని ధ్వంసం చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్‌సిబ్బంది ఉన్నారు.
230 సారా ప్యాకెట్లు సీజ్
సాలూరు రూరల్: మండలంలోని బాగువలస గ్రామం వద్ద ద్విచక్రవాహనంపై తరలిస్తున్న 230 సారా ప్యాకెట్లు సోమవారం పట్టుకున్నట్లు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. నక్కడ వలస గ్రామానికి చెందిన సురగడ రామ్మోహన్ ను పట్టుకుని సారా ప్యాకెట్లతో పాటు ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ.40 వేలు ఫైన్‌రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నామని ఈ క్రమంలో మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురు వ్యక్తుల నుండి సోమవారం కోర్డులో రూ.40 వేలు ఫైన్ కట్టించినట్లు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు.
చిన్నబగ్గ సమీపంలో ఏనుగులు
సీతంపేట: మండలంలోని చిన్నబగ్గ ఆశ్రమపాఠశాలకు సమీపంలో నాలుగు ఏనుగుల గుంపు ఘీంకరిస్తోంది. సోమవారం రాత్రి ఏనుగులు ఇక్కడికి రావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. నిన్న, మెన్నటి వరకు చిన్నబగ్గ, గోరపాడు కొండల్లో సంచరించిన ఏనుగులు ఇప్పుడు ఏకంగా గ్రామానికి దగ్గరలోనే తిష్ఠ వేయడంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి గ్రామస్తులు భయపడుతున్నారు. ఏనుగులను కవ్వించవద్దని అటువైపు ఎవ్వరూ తిరగవద్దని స్థానికులకు ట్రాకర్లు తెలియజేస్తున్నారు. ఎఫ్‌బీవో దాలినాయుడుతో పాటు సిబ్బంది ఏనుగుల గమనాన్ని పరిశీలిస్తున్నారు.

800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం