
మద్యం వద్దు.. తాగునీరు ముద్దు
● సారిపల్లిలో వినూత్న ప్రచారం
● మద్యపాన నిసేధంపై ఇంటింటికీ కరపత్రాల పంపిణీ
నెల్లిమర్ల రూరల్: మండలంలోని సారిపల్లి గ్రామంలో మద్యం ఏరులై పారుతోంది. బెల్టు షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఎక్కడ చూసినా మద్యం లభిస్తోంది కానీ తాగునీరు మాత్రం దొరకడం లేదని గ్రామానికి చెందిన పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలకులకు కనువిప్పు కలిగేందుకు గ్రామస్తులు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ రాయి పైడమ్మ, ఎంపీటీసీ మజ్జి త్రివేణి ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటికీ పర్యటించి మద్యపాన నిషేధంపై ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఇటీవల పార్టీలకు అతీతంగా సమావేశం ఏర్పాటు చేశామని, ఆలయాల నిర్మాణంతో పాటు గ్రామాభివృద్ధికి పలు తీర్మానాలు చేశామన్నారు. పేదలను పీల్చిపిప్పి చేస్తున్న మద్యాన్ని గ్రామంలో అమ్మకూడదని హెచ్చరికలు కూడా జారీ చేశామన్నారు. అయినప్పటికీ కొందరు యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని మండిపడ్డారు. గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిసేధమే లక్ష్యంగా కరపత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. తాగునీరు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, జల్‌జీవన్ మిషన్‌లో భాగంగా మంజూరైన ఇంటింటి కుళాయిల ఏర్పాటుకు కూటమి నాయకులు సహకరించాలని కోరారు.