
మడ్డువలసలో ఏనుగుల విధ్వంసం
వంగర: మండల పరిధి మడ్డువలస గ్రామంలో ఏనుగుల గుంపు విధ్వంసం సృష్టించింది. రెండు రోజులుగా ఇక్కడ సంచరిస్తున్న ఏనుగులు గ్రామానికి చెందిన బూరాడ విష్ణు, దత్తి వెంకటనాయుడు, బూరాడ నాయుడు, తివనాన సుబ్బినాయుడు, బూరాడ కృష్ణ, నరసయ్యల వరినారు మడులను ధ్వంసం చేశాయి. ఉభాలకోసం సిద్ధం చేస్తున్న నారుమడులను నాశనం చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అలాగే బూరాడ వెంకటరావుకు చెందిన ధాన్యం బస్తాలు, గొడౌన్‌ను ఏనుగులు ధ్వంసం చేయగా, తివనాన సుబ్బినాయుడు ధాన్యం బస్తాలను చెల్లచెదురు చేశాయి. అనంతరం ఈ గుంపు మడ్డువలస సమీపంలో ఉన్న రేగిడి మండల సరసనాపల్లి తోటలోకి ప్రవేశించాయి.
జర్నలిస్టుల నిరసన ప్రదర్శన
● మీడియా ప్రతినిధిపై దాడులను ఖండించిన పాత్రికేయులు
● విజయనగరం కోట నుంచి మూడులాంతర్ల కూడలి వరకు నిరసన ర్యాలీ
విజయనగరం క్రైమ్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలపక్షాన నిలిచే పత్రికలు, మీడియా, జర్నలిస్టులపై ఇటీవల కాలంలో జరుగుతున్న దాడులను మీడియా ప్రతినిధులు ముక్తకంఠంతో ఖండించారు. వాటికి నిరసనగా విజయనగరంలోని కోట కూడలి నుంచి గురజాడ అప్పారావు రోడ్డు మీదుగా మూడులాంతర్లు కూడలి వరకు శనివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అక్కడ జర్నలిస్టు సంఘాల నాయకులు శివప్రసాద్, ఎంఎంఎల్ నాయుడు, కోటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ రాజకీయ నాయ కులు, పోలీసులు తరచూ జర్నలిస్టులపై దాడులకు పాల్పడుతుండడం విచారకరమన్నారు. విజయనగరంలో ఎన్‌టీవీ జిల్లా రిపోర్టర్‌పై టూటౌన్ ఎస్‌ఐ దురుసుగా వ్యవహరించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఎస్‌ఐ తీరుపై ఏఎస్పీ సౌమ్యలతకు ఫిర్యాదు చేశామని, తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ఆధునిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటూ ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్న మీడియా ప్రతినిధిపై ఎస్‌ఐ దాడిచేయడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. కార్యక్రమంలో జర్నలిస్టు ప్రతినిధులు భానుప్రసాద్, బూరాడ శ్రీనివాసరావు, సత్యనారాయణ, శ్రీధర్, రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

మడ్డువలసలో ఏనుగుల విధ్వంసం