
కలెక్టర్ తీరుపై భగ్గుమన్న జిందాల్ నిర్వాసితులు
శృంగవరపుకోట: జిందాల్‌కు భూములిచ్చి నష్టపోయిన రైతాంగానికి మేలు చేయమంటే జిల్లాకు ఉన్నతాధికారి అయిన కలెక్టర్ నిర్వాసితులను బెదిరించడం ఎంత వరకు సమంజమని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్, నిర్వాసిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు జరుగుతున్న అన్యాయంపై జిందాల్ నిర్వాసితులు బొడ్డవరలో శనివారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ నిర్వాసితులు ఎవరో మభ్యపెడితే, ఆశ పెడితే ఆందోళనకు దిగారని చెప్పడం సరికాదన్నారు. నిర్వాసితులు తమకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు మద్దతుగా ఉండాలని అన్ని పక్షాల వారిని కోరిన విషయం గుర్తించాలన్నారు. జిందాల్ తమకు ఇస్తామన్న ఉద్యోగం, పరిహారం, షేర్లు, ఇల్లు వంటి హామీలు ఎవరు తీరుస్తారు? ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో ఉపాధి కల్పిస్తామంటారే తప్ప, నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగం ఇస్తామని ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. జిందాల్ ఇచ్చిన హామీలు తీర్చడంలో ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తామని ఎందుకు హామీ ఇవ్వరని నిలదీశారు. జిందాల్ భూముల్లో ఎవరికీ హక్కు లేదన్న కలెక్టర్ ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటులో ఎందుకు ఉత్సాహం చూపుతున్నారని ప్రశ్నించారు. జిందాల్ నిర్వాసితుల సమస్యలపై తరువాత ఆలోచిద్దాం అన్న కలెక్టర్, ప్రజాప్రతినిధులను ఏమనాలని ప్రశ్నించారు. కంపెనీల ఏర్పాటుకు నిర్వాసితులు వ్యతిరేకం కాదన్న విషయాన్ని కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు గుర్తించుకోవాలన్నారు. నిర్వాసితులను బెదిరించాలనుకోవడం సరికాదని, అధికారులు, ప్రజాప్రతినిధులను జిందాల్ తప్పుదోవ పట్టిస్తుందన్న విషయం తెలుసుకోవాలని సూచించారు. పెద్ద సంఖ్యలో నిర్వాసితులు పాల్గొన్నారు.
మేలు చేయమంటే బెదిరించటం కాదు..