
విశ్రాంత డీఈవోపై దాడి కేసులో నిందితుడు అరెస్టు
విజయనగరం క్రైమ్ : విజయనగరం టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంటున్న విశ్రాంత డీఈవో అప్పలనాయుడుపై దాడి చేసిన నిందితుడ్ని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించి సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు... నగరంలోని పూల్‌బాగ్‌లో నివాసం ఉంటున్న అప్పలనాయుడు ఇంటికి ఈ నెల 26న సోలార్ ప్యానెల్ పని నిమిత్తం వంకర కృష్ణ వచ్చాడు. అంతకు ముందు ఈ నెల 24న కృష్ణ విశ్రాంత డీఈవో ఇంటికి వచ్చినపుడు ఇంట్లో మహిళల ఒంటిపై బంగారు ఆభరణాలు ఉండడం చూసి పక్కా పథకం రచించాడు. ఈ క్రమంలో 26న ఇంటికి వేట కొడవలిని సంచిలో పెట్టుకుని కృష్ణ వచ్చాడు. ఆ సమయంలో అప్పలనాయుడు ఫోన్ చూస్తుండగా ఒక్కసారిగా వెంట తెచ్చిన వేట కొడవలితో ఆయనపై దాడి చేశాడు. ఈ మేరకు అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి భోగాపురానికి చెందిన కృష్ణను శనివారం అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు.