
సికిల్ సెల్ వ్యాధిని పూర్తిగా అరికట్టాలి
విజయనగరం ఫోర్ట్: సికిల్‌సెల్ వ్యాధిని పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో శుక్రవారం ఆయన వైద్యారోగ్యశాఖ, గిరిజన సంక్షేమశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ వ్యాధి గ్రస్తులకు సికిల్‌సెల్ వ్యాధిపై అవగాహన కల్పించాలని కోరారు. గిరిజన గ్రామాల్లో 44 వేల మంది జనాభా నివసిస్తున్నారని, వారిలో 40 సంవత్సరాల లోపు జనాభా 22 వేలు ఉన్నారన్నారు. 17 వేల మందికి సికిల్ సెల్ టెస్టులు చేయగా ఇద్దరికి వ్యాధి ఉన్నట్లు తేలిందని చెప్పారు. 118 మందికి వ్యాధి వచ్చే అవకాశం ఉందని నిర్ధారణ అయినట్లు తెలిపారు. వారే కాకుండా ప్రస్తుతం జిల్లాలో 160 మంది వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారని, వారికి అందిస్తున్న వైద్యంపై వారం రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వ్యాధి వచ్చే అవకాశం ఉన్న 118 మందితో సమావేశం నిర్వహించి వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల, డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి, డీఎల్‌ఓ డాక్టర్ రాణి, డీఈఓ మాణిక్యం నాయుడు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అన్నపూర్ణ, ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీ అరుద్ర, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అసోసియేట్ ప్రొఫెసర్‌లు డాక్టర్ శివకుమార్, డాక్టర్ అర్చన, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ బీఆర్. అంబేడ్కర్