
రసాభాసగా టీడీపీ గ్రామ కమిటీల ఎన్నిక సమావేశం
● డెంకాడలో వర్గపోరు
● సమావేశం సాక్షిగా కేకలు వేసుకుంటూ, ఒకరినొకరు తోసుకున్న నాయకులు, కార్యకర్తలు
● నిలిచిన గ్రామ కమిటీల ఎన్నిక ప్రక్రియ
డెంకాడ:
విజయనగరం జిల్లా డెంకాడ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన టీడీపీ సమావేశం, గ్రామ కమిటీ ఎన్నిక రసాభాసగా సాగింది. పార్టీ గామ ఎన్నికల కమిటీ పరిశీలకుడు, విజయనగరానికి చెందిన కనకల మురళీమోహన్ సమక్షంలోనే పార్టీ నాయకులు, కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటూ, తోసుకుంటూ గందరగోళాన్ని సృష్టించారు. ఎన్నిలక పరిశీలకుడితో పాటు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పతివాడ అప్పలనారాయణ, పార్టీ మండలాధ్యక్షుడు పల్లె భాస్కరరావు గ్రామాల వారీగా నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో పల్లెల్లోని పార్టీ శ్రేణుల్లో విభేదాలు ఒక్కసారి పొడచూపాయి. ఒకరిపై ఒకరు దూషణకు దిగారు. ఎన్నిక ప్రక్రియ రచ్చగా మారడంతో కొన్ని గ్రామ కమిటీ ఎన్నిక ప్రక్రియను నిలిపివేశారు. వాస్తవంగా చాలా రోజులుగా నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు వర్గాలుగా చీలిపోయాయి. ఓ వర్గం జనసేనకు చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే నాగమాధవికి మద్దతు ఇవ్వడంతో మరోవర్గం గుర్రుగా ఉంది. ఎమ్మెల్యేతో తిరిగిన వర్గానికి చెందిన వారికే పనులు జరుగుతుండడం, మిగిలిన వారి పనులు పెండింగ్‌లో ఉండిపోతుండడంతో తరచూ అలజడి రేగుతోంది. దీని ప్రభావం ఇప్పుడు గ్రామకమిటీల ఎన్నికలపై పడింది. పల్లెల్లోనూ పార్టీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోవడమే ఈ అలజడికి ప్రధాన కారణమని పార్టీ నాయకులు కొందరు బహిరంగంగా చెబుతున్నారు.