
వైభవంగా జగన్నాథుని రథయాత్ర
● ముహూర్తానికి కదిలిన
జగన్నాథ రథచక్రాలు
● స్వామివారిని దర్శించి, తరించిన
భక్తలోకం
విజయనగరం టౌన్: మంగళ వాయిద్యాలు, భక్తుల జయజయ ధ్వానాలు, మహిళల కోలాట ప్రదర్శనలు, వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ విజయనగరం సంతపేట జగన్నాథస్వామి రథయాత్ర శుక్రవారం వైభవంగా సాగింది. ఉదయం 9.15 గంటలకు శాస్త్రోక్తంగా జగన్నాథస్వామివారితో పాటు బలభద్ర, సుభద్ర విగ్రహా లను ఆశీనులు చేశారు. అనంతరం దేవదాయశాఖ జిల్లా అసిస్టెంట్ కమిషన్, ఆలయ ఈఓ కె.శీరీష రథం లాగి రథయాత్రను ప్రారంభించారు. రథంపై వచ్చిన స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. దాసన్నపేట, మూడుకోవెళ్లు, కొత్తపేట శ్రీమన్నార్ రాజగోపాలస్వామి ఆలయం ఆవరణలోనూ రథోత్సవం వేడుకగా జరిగింది. రాత్రి స్వామివారిని గుండిచా మందిరానికి తరలించారు. తోమాలమందిరం వద్ద శనివారం నుంచి స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా ఈఓ శిరీష మాట్లాడుతూ ఈ నెల 28న శనివారం నుంచి జూలై 4వ తేదీ శుక్రవారం వరకు ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు, విష్ణు సహస్రనామాలు, జగన్నాథస్వామివారి చరిత్ర, భగవద్గీత, గోవిందనామస్మరణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జూలై 5న శనివారం మారు రథయాత్ర ఉత్సవం వేడుకగా నిర్వహిస్తామని తెలిపారు. భక్తులందరూ స్వామివారిని దర్శించి, తరించాలని కోరారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

వైభవంగా జగన్నాథుని రథయాత్ర