
రాజాంలో రియల్ దందా!
● సాగునీటి చెరువులు కబ్జా ● మాయమవుతున్న ఎరుకువాని చెరువు
రాజాం:
రాజాంలో రియల్ ఎస్టేట్ దందా సాగుతోంది. సాగునీటి చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయి. రాత్రికి రాత్రి నివాస స్థలాలుగా మారుతున్నాయి. దీనికి రాజాం మండలం మొగిలివలస గ్రామ పరిధిలోని శ్రీ చైతన్య స్కూల్ సమీపంలోని ఎరుకువాని చెరువే నిలువెత్తు నిదర్శనం. 20 ఎకరాల చెరువు గర్భంతో ఉన్న చెరువు ఏడాది కాలంలో 20 సెంట్లు మిగిలిఉందంటే ఆక్రమణల పర్వం ఏ స్థాయిలో జరుగుతుందో గుర్తించవచ్చు. నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు చెరువు గర్భంలో ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించాలని కోరుతున్నారు. ఈ విషయంపై రాజాం తహసీల్దార్ ఎం.రాజశేఖరం స్పందిస్తూ ఎరుకువాని చెరువు ఆక్రమణలకు గురవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆర్‌ఐలు, వీఆర్వోలు, సర్వేయర్లతో కొలతలు వేసి, ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేపట్టామన్నారు. జిల్లా అధికారులు దృష్టిలోపెట్టి ఆక్రమణలు పూర్తిగా తొలగిస్తామని స్పష్టంచేశారు.