
పీఎంఎఫ్‌బీవైపై విస్తృత ప్రచారం
విజయనగరం అర్బన్: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అధికారులకు సూచించారు. పంటల బీమా పథకం వివరాలు తెలియజేసే కరపత్రాలు, పోస్టర్లను జేసీ తన చాంబర్‌లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల సమయంలో వరి, మొక్కజొన్న, సువ్వులు, పత్తి తదితర పంటల పాడైతే పీఎంఎఫ్‌బీవై కింద పరిహారం అందుతుందన్నారు. రైతులు ప్రీమియం చెల్లించి లబ్ధిపొందాలని కోరారు. జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు మాట్లాడుతూ పంటల బీమా పథకాన్ని వరి పంటకు గ్రామం యూనిట్‌గాను, మొక్కజొన్న, నువ్వు పంటలకు మండలం యూనిట్‌గా అమలు చేస్తారని, పత్తి పంటకు వాతావరణ పరిస్థితులు ఆధారంగా మండలం యూనిట్‌గా అమలు చేస్తారని తెలిపారు. ఎకరానికి వరి పంటకు రూ.200, మొక్కజొన్నకు రూ.165, నువ్వుల పంటకు రూ.65 చొప్పున రైతులు ప్రీమి యం చెల్లించాలన్నారు. పత్తి పంటకైతే ఎకరాకు రూ.1923 చొప్పున రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రమణమూర్తి, డీసీసీబీ సీఈఓ ఉమామహేశ్వరరావు, ఇప్కోప్రతినిధి రామకృష్ణ, వ్యవసాయ ఇన్సూరెన్స్ కంపెనీ జోనల్ మేనేజర్ జనార్దన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
జేసీ సేతు మాధవన్