
100 రోజులు పనికల్పించకపోతే చర్యలు
జామి: వేతనదారు కుటుంబానికి 100 రోజులు పని కల్పించకపోతే చర్యలు తప్పవని డ్వామా పీడీ ఎస్.శారదాదేవి ఉపాధిహామీ సిబ్బందిని హెచ్చరించారు. జామి మండలపరిషత్ కార్యాలయంలో మంగళవారం 19వ విడత సామాజిక ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ 24 నుంచి మార్చి 2025 వరకు ఉపాధిహమీ పథకం కింద చేపట్టిన పనులపై గ్రామాల్లో సోషల్ ఆడిట్ బృందాలు తనీఖీలు నిర్వహించి తయారు చేసిన నివేదికలను చదివి వినిపించారు. మండలంలో రూ.18 కోట్ల 40 లక్షలతో చేపట్టిన పనుల వివరాలను తెలియజేశారు.
చాలా గ్రామాల్లో 100 రోజులు పని కల్పించకపోవడం, పనుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, పనుల కొలతల్లో తేడాలు వంటివి పరిశీలనకు వచ్చినట్టు సమావేశంలో వెల్లడించారు. కార్యక్రమంలో ఏపీడీ పద్మజ, ఎంపీడీఓ ఎన్.అప్పలనాయుడు, ఎస్‌టీఎం కె.సత్యనారాయణ, ఎస్‌ఆర్పీ రామచంద్రరావు, జిల్లా విజిలెన్స్ అధికారి వెంకటరమణ, ఏపీఓ కిరణ్మయి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ గొర్లె రవికుమార్, పలు గ్రామాల సర్పంచ్‌లు, డీఆర్పీలు పాల్గొన్నారు.
డ్వామా పీడీ శారదాదేవి