
యావన్మందికీ తెలియజేయునది ఏమనగా...
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారిని రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడి నుంచి చదురుగుడికి తీసుకువచ్చే దేవర మహోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నెల 12న నిర్వహించనున్న దేవర మహోత్సవ ఘట్టాన్ని ప్రజలందరికీ తెలియజేసేలా పైడితల్లి అమ్మవారి ఆలయ తలయారీ రామవరపు చినపైడిరాజు బృందం సోమవారం సాయంత్రం ఆలయ ఆవరణలో చాటింపు వేసింది. అమ్మవారికి భాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాల నడుమ సాంబ్రాణి ధూపంతో ప్రత్యేక పూజలు నిర్వహించి మనవి చెప్పారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్, సిబ్బంది, అధికారులు అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ చాటింపు వేశారు. భక్తులందరూ ఆ రోజు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకోవాలని కోరారు.
ఏర్పాట్లు చేస్తున్నాం
ఆలయ ఇన్‌చార్జి ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ మాట్లాడుతూ దేవర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మే 12వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరుగుతాయన్నారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని గాడీఖానా, ఎన్‌సీఎస్ రోడ్డు, గంటస్తంభం మీదుగా హుకుంపేటలో ఉన్న అమ్మవారి చదురువద్దకు తీసుకువెళ్లి పూజలు చేస్తామన్నారు. రాత్రి 10 గంటలకు హుకుంపేట నుంచి ఊరేగింపుగా మంగళవారం వేకువజామున మూడులాంతర్లు వద్ద నున్న చదురుగుడి వద్దకు తరలించి ఆశీనులు చేస్తారని తెలిపారు. అప్పటి నుంచి అమ్మవారు ఉయ్యాల కంబాల మహోత్సవం వరకూ చదురుగుడిలోనే కొలువై భక్తులకు దర్శనమిస్తారన్నారు. భక్తులందరూ దేవర మహోత్సవంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఆలయ సూపర్ వైజర్ ఏడుకొండలు, రమేష్ పట్నాయక్, మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.
మే 12న పైడితల్లి అమ్మవారి దేవర
మహోత్సవం
చాటింపు చేసిన ఆలయ తలయారీలు

యావన్మందికీ తెలియజేయునది ఏమనగా...