టాప్‌గేర్‌లో భూ రీసర్వే | Sakshi
Sakshi News home page

టాప్‌గేర్‌లో భూ రీసర్వే

Published Tue, Nov 14 2023 12:42 AM

సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేస్తున్నారిలా... - Sakshi

తొలి రెండు విడతల్లో 34 గ్రామాల్లో సర్వే పూర్తి

ఇప్పటివరకు 49,302 హద్దు రాళ్ల ఏర్పాటు

మూడు, నాలుగు విడతల్లో 46 గ్రామాల్లో సర్వే

జిల్లాకు కొత్తగా 13 మంది సర్వేయర్ల కేటాయింపు

డిసెంబర్‌ 31 నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు

టాప్‌గేర్‌లో భూ రీసర్వే

అస్తవ్యస్తంగా మారిన భూముల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు.. సాహసోపేతంగా భూముల రీసర్వే చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సత్ఫలితాలు సాధిస్తోంది. బ్రిటిష్‌ కాలం నాటి భూముల రికార్డుల స్థానంలో ఆధునిక డిజిటల్‌ భూ రికార్డులను అందుబాటులోకి తీసుకొస్తోంది. మొదటి రెండు విడతల్లో 34 గ్రామాల్లో విజయవంతంగా సర్వే పూర్తి చేసిన అధికారులు.. మూడు, నాలుగు విడతల్లో 46 గ్రామాల్లో

భూ సరిహద్దులతో పాటు గ్రామాలకూ సాంకేతిక హద్దులు గుర్తింపు ప్రక్రియ

వేగవంతం చేశారు.

– సాక్షి, విశాఖపట్నం

గ్రామాల్లో భూ తగాదాలు లేకుండా ప్రశాంత పల్లెలుగా విరాజిల్లాలి అనే సంకల్పంతో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష అనే పథకం తీసుకొచ్చింది. రికార్డుల ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా.. భూ యజమానులకు స్పష్టమైన హక్కు కల్పించడం, అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా భూ హద్దులను గుర్తించి ఆ భూమికి రక్షణ కల్పించడమే ధ్యేయంగా జిల్లాలో రీసర్వే జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి డ్రోన్‌ సర్వే పూర్తయింది. అయితే.. నౌకాదళ పరిధిలో కొన్ని గ్రామాలుండటం వల్ల రీసర్వేకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో నేవీ అధికారులతో కలెక్టర్‌ డా.మల్లికార్జున సంప్రదింపులు జరిపి.. నేవీ పరిధిలోని గ్రామాల్లోనూ డ్రోన్‌ సర్వేకు అనుమతులు తీసుకొని శరవేగంగా పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్‌ ఇండియా సహకారంతో ఆర్థోరెక్టిఫైడ్‌ రేడార్‌ ఇమేజ్‌(ఓఆర్‌ఐ) మ్యాప్‌ల సహాయంతో సర్వే పనులు జరుగుతున్నాయి. మొదటి విడతలో 11 గ్రామాల్లోనూ, రెండో విడతలో పూర్తయిన 23 గ్రామాల్లో కలిపి మొత్తం 34 గ్రామాల్లో 49,302 వరకు రాళ్లు ఏర్పాటు ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది.

డిసెంబర్‌ నాటికి పూర్తికి చర్యలు

మూడో విడతలో 40 గ్రామాలు, నాలుగో విడతో స్వల్ప వివాదాలు, సాంకేతిక సమస్యలున్న ఆరు గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అయితే.. సాంకేతిక సమస్యలను పరిష్కరించి.. మూడో విడతలోనే 46 గ్రామాలను పూర్తి చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే 14 గ్రామాల్లో ప్రాథమిక సర్వే పూర్తయింది. మిగిలిన గ్రామాల్లోనూ పూర్తి చేసేలా జోరుగా పనులు నిర్వహిస్తూ.. డిసెంబర్‌ 31 నాటికల్లా రీసర్వేను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రతీ భూమికి సరిహద్దులను జియో ట్యాగింగ్‌ ద్వారా నిర్ణయిస్తున్నారు. కేవలం నాలుగు దిశల్లో మాత్రమే కాకుండా.. ప్రతీ ప్రాంతంలో ఎన్ని స్థలాలున్నాయో.. ప్రతీ దిశలో ప్రతీ పాయింట్‌కు జియో కోడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

56 మంది సర్వేయర్లతో..

ప్రస్తుతం 43 మంది సర్వేయర్లతో సర్వే నిర్వహిస్తుండటం కొంత ఆలస్యమైంది. అందుకే అదనంగా సర్వేయర్లను కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశాం. దీనిపై సత్వరమే స్పందించిన ప్రభుత్వం.. అదనంగా 13 మంది సర్వేయర్లని కేటాయించింది. ఇప్పుడు మొత్తం 56 మంది సర్వేయర్లతో 3, 4 విడతల సర్వేను ఏకకాలంలో వేగవంతం చేస్తున్నాం. ఒక్కో వ్యక్తికి ఉన్న భూ సరిహద్దు ఎంత అనే దానికి స్పష్టమైన కోడ్‌ను పొందుపరుస్తున్నాం. ప్రతీ గ్రామంలోని ప్రభుత్వ భూములకు ప్రత్యేక కోడ్‌ను పెడుతున్నాం. వీటితో పాటు ప్రతి గ్రామానికీ జియో కోడ్‌లతో సాంకేతిక సరిహద్దులను ఏర్పాటు చేసే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే మిగిలిన గ్రామాలకు సరిపడిన సరిహద్దు రాళ్లు జిల్లాకు చేరుకున్నాయి. ఓవైపు సర్వే నిర్వహిస్తూ.. మరోవైపు రాళ్లు ఏర్పాటు ప్రక్రియను సమాంతరంగా చేపడుతున్నాం.

– కె.ఎస్‌.విశ్వనాథన్‌, జాయింట్‌ కలెక్టర్‌

సిబ్బంది రీ సర్వే నిర్వహిస్తున్నారిలా...
1/2

సిబ్బంది రీ సర్వే నిర్వహిస్తున్నారిలా...

2/2

Advertisement
Advertisement