
పీహెచ్‌సీకి ఒక్కరే డాక్టర్
మోమిన్‌పేట: వైద్యుల కొరతతో మోమిన్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కేంద్రంలో ముగ్గురు డాక్టరు ఉండాల్సి ఉండగా.. కేవలం ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. రోజుకు 100కు పైగానే బయటి రోగులు వస్తుంటారు. మోమిన్‌పేట, మర్పల్లి, కోటపల్లి మండలాలకు చెందిన గ్రామాల ప్రజలు అత్యవసరమై ఈ పీహెచ్‌సీనే సంప్రదిస్తారు. అలాంటి ఆస్పత్రిలో కేవలం ఒక్క డాక్టరు మాత్రమే విధులు నిర్వహిస్తే ఎలా అని మండలప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రభుత్వం ముగ్గురు వైద్యులను నియమించింది. కానీ ఉన్నతాధికారులు డిప్యూటేషన్ పేరుతో ఇతర వైద్యశాలలకు పంపించారు. డిప్యూటేషన్‌లను రద్దు చేయడంతో ఇద్దరు డాక్టర్లు సుజల, రషీద్ విధులు నిర్వహిస్తూ వచ్చారు. ఆ తర్వాత డా.బుచ్చిబాబును నియమించారు. కొన్ని రోజులకు డిప్యూటేషన్‌పై బుచ్చిబాబు, రషీద్‌లను పంపించారు. దీంతో కథ మొదటికి వచ్చింది.
ఇద్దరిని పంపారు
సుజల మాత్రమే డాక్టరుగా విధులు నిర్వహిస్తున్నారు. రోగులకు కొన్ని నెలలు సవ్యంగానే వైద్యం అందింది. కానీ ఉన్నతాధికారులు తాత్కాలిక డిప్యూటేషన్ అంటూ డాక్టరు రషీద్‌ను జీనుగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, బుచ్చిబాబును డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి పంపారు. ఒక నెల అని చెప్పి అక్కడే విధులు నిర్వహించాలని పేర్కొన్నట్లు తెలిసింది. ఆస్పత్రిలో ఒక్కరే విధులు నిర్వహించడంతో రోగులకు సరైన వైద్యం సకాలంలో అందడం లేదంటున్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే వెంటనే డిప్యూటేషన్‌పై వెళ్లిన డాక్టర్లను తిరిగి రప్పించాలని, అందుకు ప్రజప్రతినిధులు చొరవ తీసుకొవాలని మండల ప్రజలు కొరుతున్నారు.
పేదలకు సకాలంలో అందని వైద్యం
పట్టించుకోని అధికారులు