
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహం
అనంతగిరి: చిన్నస్థాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆఫీసర్ నవీన్ కుమార్ బసురి తెలిపారు. వికారాబాద్ కలెక్టరేట్‌లోని పరిశ్రమల శాఖ కార్యాలయంలో మంగళవారం జనరల్ మేనేజర్ మహేశ్వర్ అధ్యక్షతన ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్‌పై వ్యవసాయ, హార్టికల్చర్, మత్స్య, పశుసంవర్ధక తదితర శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, రైతుల ఆదాయ వృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ వృద్ధి తదితర అంశాలపై ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం, సాంకేతిక మద్దతు, బ్రాండింగ్, ప్యాకేజింగ్, లేబులింగ్, మార్కెటింగ్ లింకేజెస్, రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. పథకంలో భాగంగా వ్యక్తిగత యూనిట్లకు 35శాతం రాయితీ, గరిష్టంగా 10 లక్షల వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. సమూహ ప్రాజెక్టులకు (ఎఫ్సీఓలు, స్వయం సహాయక సంఘాలు, ప్రొడ్యూసర్ గ్రూపులకు) గరిష్టంగా రూ.3 కోట్ల వరకు రాయితీ పొందవచ్చని వివరించారు.
వ్యవసాయ, హార్టికల్చర్, పశుసంవర్ధక, మత్స్య ఉత్పత్తుల ప్రాసెసింగ్, విలువవృద్ధి, బ్రాండింగ్, మార్కెటింగ్, రుణ మద్దతు తదితర అంశాల్లో ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు ఈ పథకం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా పరిశ్రమల కేంద్రం సెల్ నంబర్ 8121009155లో సంప్రదించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆఫీసర్ నవీన్‌కుమార్ బసురి
పలు శాఖల అధికారులతో సమావేశం