
అక్రమార్కులపై చర్యలు తీసుకోండి
బషీరాబాద్: మండలంలోని ఎక్మాయి గ్రామంలో ఇందరిమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామస్తులతో కలిసి సీపీఎం పార్టీ నాయకులు ధర్నాకు దిగారు. గ్రామంలోని అధికార పార్టీకి చెందిన నలుగురు నాయకులు డబ్బులు తీసుకొని ఇళ్లు కేటాయించారని ఆరోపించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎక్మాయిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో 70 శాతం అనర్హులకు ఇళ్లు కేటాయించారన్నారు. ముఖ్యంగా ఎస్సీ, బీసీ, మైనార్టీ, పేదలకు ఇళ్లు ఇవ్వకుండా ఉన్నత వర్గాలకు చెందిన వారికి, కాంగ్రెస్ నాయకుల కుటుంబ సభ్యులకు ఇచ్చారని మండిపడ్డారు. లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేసిన నాయకులపై ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బాధితులతో ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆందోళనలో ఇళ్ల అక్రమాలపై సాక్షి దినపత్రికలో జూన్ 27న ప్రచురితమైన ‘ఇందిరమ్మ’లో ఇంటి దొంగలు కథనం క్లిప్పింగ్‌ను ప్రదర్శించారు. అనంతరం తహసీల్దార్ షాహేదబేగంకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్, సీపీఎం మండల నాయకులు సురేష్, వెంకటేశ్, గ్రామస్తులు గజలప్ప, శ్యామప్ప, అమృతమ్మ, లక్ష్మి, మంజుల, రేణుక, జె.లక్ష్మి, నర్సిములు, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్