
బడుల్లో గ్రంథాలయాలు
దౌల్తాబాద్: విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచడానికి విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం గ్రంథాలయంలో పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మండలంలోని 33 గ్రామ పంచాయతీల్లో 41 పాఠశాలలున్నాయి. ఇందులో నుంచి 12 ప్రాథమిక, 4 ప్రాథమికోన్నత పాఠశాలలకు ఎంపిక చేశారు. వాటికి ప్రభుత్వం గ్రంథాలయ పుస్తకాలను అందజేసింది.
రెండు భాషల్లో..
నేషనల్ బుక్స్ ట్రస్ట్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజి ఆధ్వర్యంలో గ్రంథాలయ పుస్తకాలను రూపొందించారు. నీతి కథలతో విద్యార్థుల్లో మేథా సంపత్తి పెంపొందించేలా పుస్తకాలను తీర్చిదిద్దారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో అందమైన బొమ్మతలతో పిల్లలను ఆకట్టుకునేలా పాఠ్యాంశాలు ఉన్నాయి. అభ్యసన సామర్థ్యాలతో పాటు విద్యా ప్రగతికి దోహదం చేసేలా ఉన్నాయి. చదువు విలువ తెలిసేలా అందులో పాఠ్యాంశాలను పొందుపర్చారు. ఒక్కో పాఠశాలకు 117 రకాల పుస్తకాలు సమకూర్చుతున్నారు. పాఠశాలల్లో ప్రత్యేక గదిని కేటాయించి గ్రంథాలయంగా మార్చి విద్యార్థులు నిత్యం పుస్తకాలు చదివేలా ఒక పీరియడ్‌ను సైతం విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపే లక్ష్యం
ఒక్కో పాఠశాలకు 117 పుస్తకాలు
రోజూ చదివించాలి
విద్యార్థులతో గ్రంథాలయ పుస్తకాలను ప్రతి రోజు చదివించాలి. అర్థం కాని విషయాలను ఉపాధ్యాయులు చిన్నారులకు వివరించాలి. విద్యా సంవత్సరం ముగిసే వరకు పుస్తకాలను భద్రంగా ఉంచాలి. ఆకట్టుకున్న పుస్తకాలపై విద్యార్థులు దృష్టి సారించేలా చూడాలి.
– వెంకట్‌స్వామి, ఎంఈఓ, దౌల్తాబాద్