
నత్తనడకన ‘వనమహోత్సవం’
వికారాబాద్: జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమం నత్తను తలపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొన్ని శాఖలు 20 శాతం మేర మొక్కలు నాటగా సగం శాఖలు పనులే ప్రారంభించలేదు. రెండు నెలల క్రితమే జిల్లా అధికారులు ఆయా శాఖలకు మొక్కల లక్ష్యాలను నిర్దేశించారు. ఈ ఏడాది 40.48 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. సీజన్ ప్రారంభ సమయంలో వర్షాలు కురవక పోవడంతో మొక్కలు నాటే కార్యక్రమం ముందుకు సాగలేదు. ప్రస్తుతం వానలు పడుతున్నా అధికారుల్లో చలనం లేదు. వనమహోత్సవంలో ప్రాధాన్యతను బట్టి 19 శాఖలను భాగస్వాములను చేశారు. అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం సాగనుంది.
అధికారుల అలసత్వం
మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా వనమహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏటా లక్షలాది మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 40,48,500 మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు. గతేడాది నాటిన మొక్కల్లో 80శాతం బతికాయని అధికారులు చెబుతున్నా వాస్తవానికి 50 నుంచి 60 శాతం మాత్రమే పెరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 8లక్షల లోపు మాత్రమే మొక్కలు నాటారు. పశు సంవర్ధక శాఖ, మైనింగ్, సివిల్ సప్లయ్, పోలీసు, ఆర్‌అండ్‌బీ, డీడబ్ల్యూఓ, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీలు కార్యక్రమాన్ని ప్రారంభించలేదు.
581 నర్సరీల్లో పెంపకం
జిల్లా వ్యాప్తంగా అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో 581 నర్సరీల్లో 38,30000 మొక్కలను పెంచుతున్నారు. ఈ సారి టేకు మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామ పంచాయతీలకు అత్యధిక లక్ష్యాలను కేటాయించారు.
వానాకాలం ప్రారంభమై నెలన్నర దాటినా నాటింది 20 శాతంలోపే..
ఈ ఏడాది లక్ష్యం 40,48,500 మొక్కలు
19 ప్రభుత్వ శాఖలకు బాధ్యతలు
పనులు ప్రారంభించని సగం శాఖలు
శాఖల వారీగా కేటాయించిన లక్ష్యం
శాఖ మొక్కలు
అటవీ 5లక్షలు
విద్య 11వేలు
ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ 9,43,500
ఉద్యానవన 2లక్షలు
వ్యవసాయ 5లక్షలు
తాండూరు మున్సిపాలిటీ 70వేలు
వికారాబాద్ మున్సిపాలిటీ 80వేలు
కొడంగల్ మున్సిపాలిటీ 35వేలు
పరిగి మున్సిపాలిటీ 30వేలు
మరి కొన్ని శాఖలకు లక్ష్యాన్ని నిర్ద్ధేశించారు