
అటవీ భూమి కబ్జాకు యత్నం
● అడ్డుకున్న ఫారెస్టు అధికారులు ● పరారీలో నిందితులు ● కేసు నమోదు
బషీరాబాద్: మండలంలోని మైల్వార్ రిజర్వ్‌డ్ ఫారెస్టులో ఆక్రమణలు ఆగడం లేదు. తాజాగా మైల్వార్ తండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మూడు రోజులుగా సర్వే నంబర్ 218లో రెండు ఎకరాల అటవీ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారు. సుమా రు 50 వరకు చెట్లను నరికి ట్రాక్టర్‌తో చదును చేశారు. విషయం తెలుసుకున్న అటవీ సెక్షన్ అధికారులు స్నేహశ్రీ, ఫీర్యానాయక్, మమత, బీట్ అధికారి మల్లప్ప అక్కడికి చేరుకున్నారు. అధికారుల రాకను గుర్తించిన కబ్జాదారులు, ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యారు. తండాకు చెందిన గోపాల్ రాథోడ్, రతన్ రాథోడ్ అటవీ భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. భూమిని చదును చేసేందుకు మైల్వా ర్‌కు చెందిన షఫీ ట్రాక్టర్‌ను వినియోగించినట్లు తేల్చారు. వాహనాన్ని సీజ్ చేయడానికి వెళితే అప్పటికే దాన్ని రహస్య ప్రాంతానికి తరలించి సదరు యజమాని పరారైనట్లు అధికారులు తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సెక్షన్ అధికారి స్నేహశ్రీ తెలిపారు. అటవీ ప్రాంతంలో చెట్లను నరికినా, భూమిని కబ్జా చేయాలని ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.