ఆపరేషన్‌ ముస్కాన్‌ | - | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ ముస్కాన్‌

Jun 27 2025 6:24 AM | Updated on Jun 27 2025 6:35 AM

ఆపరేషన్‌ ముస్కాన్‌

ఆపరేషన్‌ ముస్కాన్‌

వికారాబాద్‌: బాల్యం పిల్లల హక్కు.. చిన్నారులు ఉండాల్సింది పాఠశాలల్లోనే.. వారితో పనులు చేయిస్తే వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. చిన్నారుల రక్షణ కోసం అనేక చట్టాలు వచ్చాయి. అందులో ఒకటి విద్యాహక్కు చట్టం. ఈ చట్టం అమల్లోకి వచ్చినా పిల్లలు పనులకు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. చిన్నారులను పాఠశాలలో ఉంచడం కోసం నియమించిన ఆయా శాఖల అధికారులు తూతూ మంత్రపు కార్యక్రమాలతో మమా అనిపిస్తున్నారు. దీంతో బాల కార్మికులు రోజురోజుకూ పెరుగుతున్నారే తప్ప.. తగ్గడంలేదు. ఆరు నెలలకోసారి చేపట్టే ఆపరేషన్‌ ముస్కాన్‌, ఆపరేషన్‌ స్మైల్‌ లాంటి కార్యక్రమాలు సైతం సత్ఫలితాల నివ్వడంలేదు. ఇప్పటి వరకు జిల్లాలో 13 సార్లు ఈ కార్యక్రమలు నిర్వహించిన అధికారులు 14వ విడతకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వచ్చే వారంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏడాదికి రెండుసార్లు

ఆయా పనుల్లో మగ్గుతున్న బాలకార్మికులకు విముక్తి కల్పించి వారిని బడులకు పంపాలనే లక్ష్యంతో అధికారులు ఆపరేషన్‌ ముస్కాన్‌.. ఆపరేషన్‌ స్మైల్‌ పేరుతో కార్యక్రమాలు రూపొందించారు. ఇందులో భాగంగా పోలీస్‌, ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌, విద్య, ఆరోగ్య శాఖ, చైల్డ్‌ లైన్‌ సభ్యులతో బృందాలను ఏర్పాటు చేస్తారు. ప్రతి ఆరు నెలలకోసారి ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జనవరిలో ఆపరేషన్‌ స్మైల్‌, జూలైలో ఆపరేషన్‌ ముస్కాన్‌ కొనసాగుతోంది. ఈ కార్యక్రమాలు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో నిరంతర ప్రక్రియగా సాగుతున్నాయి. మన జిల్లాలో మాత్రం ఏడాదికి రెండు సార్లు కార్యక్రమం నిర్వహించి మమా అనిపిస్తున్నారు.

పనులు మాన్పించినా..

ఆపరేషన్‌ ముస్కాన్‌.. స్మైల్‌ కార్యక్రమాల ద్వారా బాల కార్మికులకు పనుల నుంచి విముక్తి కల్పిస్తున్న అధికారులు వారు పాఠశాలలకు వెళ్తున్నారా? తిరిగి పనులకు వెళ్తున్నారా అనే విషయం పరిశీలించడం లేదు. పిల్లలను పనుల్లో పెట్టుకుంటున్న వారిపై కేసులు నమోదు చేసి చిన్నారులను హోంకు తరలిస్తున్నారు. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. హోంకు చేరిన పిల్లల వయస్సు ఆధారంగా ఆయా తరగతుల్లో చేర్చాలి. అలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కొద్ది రోజుల తర్వాత చిన్నారులు బయటికి వచ్చి తిరిగి పనులకు వెళ్తున్నారు.

పరిహారం ఊసేలేదు

బాల కార్మికులను పనులు మాన్పించి బడులకు పంపే బాధ్యత విద్యాశాఖ, కార్మిక శాఖ పైనే ఉంటుంది. ఎవరైనా పిల్లలను పనుల్లో పెట్టుకుంటే కేసులు నమోదు చేయడం తోపాటు యజమానుల నుంచి పరిహారం ఇప్పించాలి. ఇప్పటి వరకు వందల సంఖ్యలో బాల కార్మికులను విముక్తి కల్పించినా ఒక్కరికి కూడా పరిహారం ఇప్పించిన పాపాన పోలేదు. పై రెండు శాఖల అధికారులు ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమంలో పాల్గొనడంలేదు. పోలీసు, చైల్డ్‌ లైన్‌ ప్రతినిధులు మాత్రమే రిస్కు తీసుకుంటున్నారు. గత ఏడాది పోలీసులు దాదాపు 65 కేసులు నమోదు చేశారు. జిల్లాలో 1,200 మందికి పైగా బాల కార్మికులు ఉన్నట్లు స్వచ్ఛంద సంస్థల గణాంకాలు చెబుతున్నా విద్యాశాఖ వద్ద మాత్రం సరైన లెక్కలు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత ఏడాది ఆపరేషన్‌ ముస్కాన్‌ ద్వారా 65 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు అధికారులు తెలిపారు.

వందల్లో బాలకార్మికులు.. పదుల్లో విముక్తి

సత్ఫలితాలివ్వని ఆపరేషన్‌ ముస్కాన్‌, స్మైల్‌ కార్యక్రమాలు

14వ విడతకు కసరత్తు

ప్రత్యేక బృందాల ఏర్పాటు

జిల్లాలో 1,200 మందికిపైగా బాలకార్మికులు

గత ఏడాది 65 మందికే విముక్తి

మళ్లీ పనులకు వెళ్తున్న చిన్నారులు

హోంలలో సౌకర్యాల కరువు

బాల కార్మికులకు పునరావాసం కల్పించేందుకు జిల్లాలో నాలుగు హోంలు (శిశుగృహ, బాలసదనం, యజ్ఞ ఫౌండేషన్‌, హెల్ఫ్‌ ఆల్‌ సొసైటీ) ఉన్నాయి. వీటిలో సౌకర్యాలు లేక చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. పనుల నుంచి విముక్తి కల్పించిన బాలలను బడుల్లో చేర్పించే వరకు హోంలోనే ఉంచాల్సి ఉంటుంది. వారి సంరక్షణ కోసం కేర్‌ టేకర్లు, వార్డెన్లు, కౌన్సెలింగ్‌ చేసేందుకు ప్రత్యేక నిపుణులు, బ్రిడ్జి కోర్స్‌ ఇచ్చేందుకు వలంటీర్లు ఉండాలి. కానీ నాలుగు హోంలలో ఒకరు చొప్పున కేర్‌ టేకర్లు ఉన్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు బాల కార్మికులు పాఠశాలలకు వెళ్లేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement