
ఆదాచేస్తేనే జీరో బిల్!
నవాబుపేట: వేసవి తాపానికి భరించలేక జనాలు ఉపశమనం కోసమని ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు అధికంగా వాడుతుంటారు. ఫలితంగా విద్యుత్ మీటర్ గిర్రున తిరుగుతుంది. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గృహజ్యోతి పథకం వర్తించకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 200 యూనిట్ల వరకు మాత్రమే ఉచిత కరెంట్ ఇస్తారు. 200 యూనిట్లు దాటితే బిల్లు చెల్లించాల్సిందే. వేసవిలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్ పొదుపు అయి గృహజ్యోతి పథకాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. మండలంలో 7,000 వేల విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. అందులో 1,000 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి.
ఇవి పాటించాలి
● మార్కెట్‌లో 5స్టార్ రేటింగ్ ఉన్న విద్యుత్ ఉపకరణాలు మాత్రమే వినియోగించాలి.
● ఇంట్లో టీవీ అవసరం లేకపోతే రిమోట్‌తో కాకుండా పూర్తిగా ఆఫ్ చేయాలి.
● చార్జింగ్ పూర్తయ్యాక ఫోన్‌ను ఫ్లగ్ నుంచి తొలగించాలి.
● అవసరమైతేనే ఫ్యాన్లు, కూలర్లు వేయాలి.
● రిఫ్రిజిరేటర్‌లో కాలానుగుణంగా ఫ్రీజర్ లెవల్స్‌ను మార్చుకోవాలి.
● ఏసీల ఫిల్టర్లను తరచూ శుభ్రం చేస్తూ, టైమర్‌ను సెట్ చేసుకోవాలి.
● వాషింగ్‌మెషీన్‌లో లోడ్‌కు తగిన దుస్తులు మాత్రమే వేయాలి.
● నాణ్యమైన ఎస్‌ఈడీ బల్బులు వాడాలి.
● అవసరం ఉన్న గదుల్లో, అవసరమైనంత సేపే లైట్లు వేసుకోవాలి.
200 యూనిట్లు దాటితే బిల్లుల మోత
‘గృహజ్యోతి’పై వినియోగదారుల సంశయం
5 స్టార్‌తో విద్యుత్ ఆదా
గృహజ్యోతి కింద 200 యూనిట్లు దాటితే మాత్రం బిల్లులు చెల్లించాల్సిందే. 5 స్టార్ రేటింగ్ ఉంటే విద్యుత్ ఆదా అవుతుంది. ఫ్యాన్, టీవీ, కూలర్లు, బల్బులు, మిక్సీ, ఐరన్ బాక్స్‌లు ఇలా ఎలక్ట్ట్రికల్ వస్తువులు కొనుగోలు చేసే ముందు రేటింగ్ తెలుసుకోవాలి.
– శ్రీనివాస్‌రెడ్డి, ఏఈ, నవాబుపేట