
ధరాఘాతం!
భారీగా తగ్గిన ఉల్లి ధరలు
వికారాబాద్: ఉల్లి ధరలు మరింత పతనమయ్యాయి. ఏకంగా క్వింటాలు రూ.1000కి పడిపోయింది. 60 కిలోల బ్యాగును రూ.500 నుంచి రూ.550 వరకు విక్రయిస్తున్నారు. రెండు నెలల క్రితం కిలో రూ.40 నుంచి రూ.60 వరకు ధర పలికిన ఉల్లి నేడు రూ.10లకు పడిపోయింది. గతంలో వినియోగదారులకు కన్నీళ్లు తెప్పించిన ఉల్లి.. నేడు రైతును నష్టాల్లో ముంచేసింది. పంట వేసే సమయంలో ధరలు బాగుండటంతో ఎక్కువ మంది సాగు చేశారు. కానీ దిగుబడి వచ్చే నాటికి ధరలు పూర్తిగా పతనమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు మాత్రం లాభపడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
పెట్టుబడి కూడా రాని పరిస్థితి
ఉల్లి సాగుకు నీటి వసతి తప్పనిసరి.. పంట కాలం ఆరు నెలలు.. ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.70వేల వరకు ఖర్చు వస్తుంది.. రవాణా ఖర్చులు అదనం. ఎకరాకు 80 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం రూ.80 వేలకు మించి రాదు.. ఇలా చూసుకున్నా రైతుకు పెట్టుబడి వచ్చే పరిస్థితి కనిపించడ లేదు. ఈ సారి ఉల్లి దిగుబడి బాగానే వచ్చిందని.. పంట చేతికొచ్చే సమయానికి ధరలు పూర్తిగా పడిపోయాయని.. పెట్టుబడి కూడా రాదని రైతులు లబోదిబో మంటున్నారు. రెండు నెలల క్రితం క్వింటాలు ధర రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు ఉండేదని.. చిల్లరగా కిలో రూ.50 నుంచి 60 వరకు విక్రయించేవారని తెలిపారు. ప్రస్తుతం ఆశించిన ధరలు లేకపోవడంతో నష్టాలు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గణనీయంగా పెరిగిన దిగుబడి
ఈ ఏడాది ఉల్లి సాగు గణనీయంగా పెరిగింది. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 3వేల ఎకరాలు కాగా ఈ సారి 4,500 ఎకరాల్లో పంట వేశారు. గతంలో ఎకరాకు 80 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. ఈ ఏడాది హైబ్రీడ్ రకం ఉల్లి సాగు చేయటంతో ఎకరాకు 100 నుంచి 130 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.
దళారులకే లాభాలు
ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేసే రైతులకు నష్టాలు తప్పడం లేదు. పంట దిగుబడి వస్తే ధరలు లేకపోవడం.. సాగు చేయని సమయంలో విపరీతమైన ధరలు ఉండటం అన్నదాతలను కలవర పెడుతోంది. వీటికి తోడు ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతూనే ఉంటాయి. పంట కోతకు వచ్చే సమయంలో అకాల వర్షాల కారణంగా రైతులు నష్టాలు చవిచూడటం సాధారణంగా మారిపోయింది. ప్రభుత్వాలు ప్రకటించే మద్దతు ధర ఏ మాత్రం సరిపోదని రైతులు అంటున్నారు. పంట దిగుబడి బాగా వచ్చినా.. దెబ్బతిన్నా రైతులకు మాత్రం ప్రయోజనం చేకూరడం లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా దళారులు మాత్రం లాభపడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో ధరలు లేవంటూ తక్కువకే పంట దిగుబడిని కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత ఎక్కువ ధరలకు విక్రయించి లాభాలు పొందుతున్నారు. ప్రతి సీజన్‌న్‌లో ఇదే పరిస్థితి పునరావృతం అవుతోంది.
పట్టించుకోని ప్రభుత్వాలు
ధరలు పెరిగిన ప్రతిసారీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంటితుడుపు చర్యలకే పరిమితమవుతున్నాయి. శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడంలేదు. ధరలు పెరిగినప్పుడు వినియోగదారులు.. పతనమైనప్పుడు రైతులు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రెండేళ్ల క్రితం వరకు సాగు విస్తీర్ణం పెంచేందుకు రాయితీపై విత్తనాలు ఇచ్చిన ప్రభుత్వాలు ఆ తర్వాత మిన్నకుండిపోయాయి.
బహిరంగ మార్కెట్‌లో క్వింటాలు రూ.1000లోపే
ఆరుగాలం శ్రమించిన రైతుకు వచ్చేది రూ.600 మాత్రమే
సాగు విస్తీర్ణం, పంట దిగుబడి పెరగడమే కారణం