
ఫ్లెక్సీ రాజేసిన చిచ్చు
మహేశ్వరం: కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి కట్టిన ఫ్లెక్సీ అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చిచ్చు రాజేసింది. ప్రభుత్వ కార్యక్రమాలకు గులాబీ రంగు బ్యానర్‌ను ఎలా వాడతారని కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గేటు వద్ద ఎమ్మెల్యే సబితారెడ్డికి బీఆర్‌ఎస్ నేతలు ఆహ్వానం పలుకుతూ గులాబీ రంగుతో కూడిన బ్యానర్ కట్టారు. అధికారిక కార్యక్రమం వద్ద పార్టీ ఫ్లెక్సీ ఎందుకు కట్టారని బీఆర్‌ఎస్ నేతలతో కాంగ్రెస్ నాయకులు మాటల యుద్ధానికి దిగారు. ఎమ్మెల్యే సబితారెడ్డి కారు దిగగానే కాంగ్రెస్ నేతలు నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ ఫ్లెక్సీని చించేశారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట జరిగింది. వెంటనే మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు ఇరువర్గాలను చెదరగొట్టి నచ్చజెప్పారు. పరస్పరం ఇరు పార్టీల నేతలు ఫిర్యాదు చేసుకున్నారు. అనంతరం 180 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే సబితారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫ్లెక్సీ విషయంలో రాజకీయాలు చేయడం తగదన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నేరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. తులం బంగారం ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందని చురకలంటించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సభావత్ కృష్ణా నాయక్, వైస్ చైర్మన్ చాకలి యాదయ్య, పీఏసీఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ దేవరంపల్లి వెంకటేశ్వరరెడ్డి, తహసీల్దార్ సైదులు, ఎంపీఓ రవీందర్‌రెడ్డి, ఆర్‌ఐలు స్వర్ణకుమారి, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల వాగ్వాదం