
కుల్కచర్లలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే, ఉద్యోగులు
కుల్కచర్ల: గిరిజన ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో సీఆర్టీ (కాంటాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లు)గా విధులు నిర్వర్తిస్తున్న వారికి.. వేసవి సెలవుల్లో కూడా వేతనం చెల్లిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనపై సంబంధిత ఉద్యోగులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు గురువారం కుల్కచర్ల ప్రధాన చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాలకు అండగా నిలుస్తోందన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషిచేస్తోందని తెలిపారు. సీఆర్టీల క్రమబద్ధీకరణ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్యోగులు కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాందాస్ నాయక్, రైతుబంధు మండల అధ్యక్షుడు రాజు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శేరిరాంరెడ్డి, సీఆరీల సంఘం జిల్లా అధ్యక్షుడు మహేశ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మంజుల, నాయకులు అరవింద్, రాజు, చందర్, అనసూజ, గోపాల్, శ్రావణి, మంగమ్మ, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలపై సీఎంను కలుస్తా
పీఆర్టీయూ టీఎస్ నేత
గుర్రం చెన్నకేశవరెడ్డి
యాచారం: ఉపాధ్యాయుల సమస్యలపై త్వర లో సీఎం కేసీఆర్‌ను కలిసి నివేదిస్తానని పీఆర్టీయూ టీఎస్ నేత గుర్రం చెన్నకేశవరెడ్డి అన్నారు. తన స్వగ్రామం మొండిగౌరెల్లిలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన గెలుపు కోసం పీఆర్టీయూ టీఎస్ శ్రేణులు ఎంతగానో కష్టపడ్డారని తెలిపారు. ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయని, వాటిపై పూర్తి స్థాయిలో సమీక్షించినట్లు చెప్పారు. పీఆర్టీయూ టీఎస్ నుంచి రెండుసార్లు గెలిచిన జనార్దన్‌రెడ్డి రెబల్‌గా మళ్లీ పోటీ చేసి ఓట్లు చీల్చడం, డబ్బు ప్రభావితం చేశాయన్నారు. అయినా ఆందోళన చెందడం లేదని, ఉపాధ్యాయుల సమస్యలే ప్రధాన ఎజెండాగా పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కలిసి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని వివరించారు.
ఆస్తిపన్ను చెల్లింపునకు
నేడే చివరి రోజు
సాక్షి, సిటీబ్యూరో: శుక్రవారంతో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) ఆస్తిపన్ను చెల్లించాల్సిన వారి సదుపాయార్థం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు అన్ని సర్కిళ్లలోని సిటిజన్ సర్వీస్ సెంటర్లు(సీఎస్‌సీ) రాత్రి 11 గంటల వరకు పనిచేయనున్నాయి. ఆన్‌లైన్ ద్వారా అర్ధరాత్రి 12గంటలలోపు చెల్లించవచ్చని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లు గణనీయంగానే జరుగుతున్నప్పటికీ, పెరిగిన దుబారా ఖర్చులు.. ముఖ్య ప్రజాప్రతినిధులు, అధికారుల ఆడంబరాలు, వివిధ ప్రాజెక్టుల పనులు తదితరమైన వాటితో ఎన్ని కోట్ల రూపాయలు వసూలవుతున్నా ఖజానా పరిస్థితి లోటుగానే ఉంటోంది. గతంలో రూ.వెయ్యికోట్లు వసూలు కావడమే గగనమనుకున్న పరిస్థితి నుంచి ఏటికేడు టార్గెట్‌ను పెంచుతున్నారు. 2022–23 ఆర్థిక సంవత్సర టార్గెట్ రూ.2వేల కోట్లు కాగా, ఫిబ్రవరి నెలాఖరు వరకు రూ.1,514 కోట్లు వసూలయ్యాయి. మార్చినెల ఒకటోతేదీ నుంచి 30వ తేదీ సాయంత్రం వరకు దాదాపు రూ.88 కోట్లు వసూలయ్యాయి. వెరసీ రూ.1,602 కోట్లు వసూలయ్యాయి.

చెన్నకేశవరెడ్డి