పార్కు కబ్జాకు యత్నం

రాజేంద్రనగర్‌: రూ.30 కోట్ల విలువైన జీహెచ్‌ఎంసీ పార్కు స్థలాన్ని కొందరు గురువారం ఉదయం ప్రహరీని కూల్చి చదును చేశారు. స్థానిక కాలనీ వాసులు అడ్డుకోని పోలీసులకు, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు పారిపోయారు. పోలీసులు బీఎండబ్ల్యూ కారుతో పాటు రెండు జేసీబీలు, రెండు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. బీఎండబ్ల్యూ, బొలేరో వాహనంపై శివారుకు చెందిన ఎమ్మెల్యే స్టికర్‌ ఉండడం గమనార్హం. శాసీ్త్రపురం ప్రాంతంలో 1988లో హెచ్‌ఎండిఏ ద్వారా మొట్టమొదటి శాసీ్త్రపురం సొసైటీ లేఅవుట్‌ను చేపట్టారు. ఈ లేఅవుట్‌లో 13 పార్కులను ఏర్పాటు చేసి జీహెచ్‌ఎంసీకి అప్పగించారు. కాలనీలోని చర్చి, ప్రార్థనా మందిరం ఎదురుగా 1.30 ఎకరాల స్థలంలో పార్కు స్థలం ఉంది. దీన్ని చుట్టూ జీహెచ్‌ఎంసీప్రహరీని నిర్మించి మొక్కలను నాటి గార్డెన్‌ను నిర్వహిస్తోంది. దాదాపు 30 కోట్ల విలువైన ఈ స్థలాన్ని గురువారం ఉదయం కొందరు జేసీబీలు, టిప్పర్లతో వచ్చి చదును చేయడం ప్రారంభించారు. గంట వ్యవధిలో మొత్తం పార్కు ప్రహరీని కూల్చి చదును చేశారు. తెల్లవారుజామున 5 గంటలకే ఈ పనులు నిర్వహించడంతో స్థానికులు అడ్డుకొని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకోగానే నిందితులు పారిపోయారు. విషయాన్ని రాజేంద్రనగర్‌ జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో శాసీ్త్రపురం సొసైటీ సభ్యులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

పట్టించుకోని జీహెచ్‌ఎంసీ

హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో మొట్టమొదటి లే అవుట్‌ శాసీ్త్రపురంలో 1988లో చేపట్టారు. దీంతో పాటు బుద్వేల్‌లో జనచైతన్య హౌసింగ్‌ సొసైటీ వెంచర్‌ను, మైలార్‌దేవ్‌పల్లిలో టీఎన్‌జీవోస్‌ హౌసింగ్‌ సోసైటీలు చేపట్టింది. ఈ మూడు స్థలాల్లో దాదాపు 50 పార్కులను రిజిస్ట్రేషన్‌ చేసి జీహెచ్‌ఎంసీకి అప్పగించారు. రోజు రోజుకూ ఈ స్థలాల విలువ పెరుగుతుండడంతో కబ్జాదారులు వీటిని కబ్జాలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 20 పార్కులు కబ్జా అయినట్లు తెలుస్తోంది. పార్కుల నిర్వహణను జీహెచ్‌ఎంసీ పట్టించుకోకపోవడంతో విలువైన పార్కులు కబ్జాలకు గురవుతున్నాయి. స్థానికులు ఫిర్యాదులు చేయడం, అనంతరం కబ్జాదారులు భయభ్రాంతులకు గురి చేస్తుండటంతో స్థానికులు వెనుకడుగువేస్తున్నారు. కబ్జాదారులు జీహెచ్‌ఎంసీ అధికారులతో కుమ్మక్కై కబ్జాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read latest Vikarabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top